అబుదాబి లోని తెలుగు స్రవంతి సంస్థ తన దశమ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ను ఘనంగా సత్కరించింది, అబుదాబి లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు, దర్శకుడు ఏవీయస్ అధ్యక్షత వహించారు. వేలాదిగా తరలివచ్చిన తెలుగు వారు బ్రహ్మానందం సన్మాన సభకు సాక్షులుగా నిలిచారు. హీరో జగపతిబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షుడు పృద్విరాజ్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు సభలో పాల్గొన్నారు. ” బ్రహ్మానందం గొప్ప నటుడే కాదు… మహార్జాతకుడు కూడా… బ్రహ్మ దేవుడు నవ్వును సృష్టించి ఆ నవ్వును తనతరపున ప్రజలకు పంచేందుకు గానూ బ్రహ్మానందాన్ని సృష్టించాడు ” అని ఏవీయస్ అన్నారు. ఈ సందర్భంగా ప్రచురించిన ప్రత్యెక సంచికను జగపతిబాబు
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేవలం అబుదాబి మాత్రమే కాక దుబాయి, షార్జా నగరాలకు చెందిన తెలుగు వారు కూడా విశేష సంఖ్యలో తరలిరావటం విశేషం.