Site icon TeluguMirchi.com

‘సీతమ్మ..’ కోసం ఇన్ని కోట్ల ఎదురుచూపులా…!

Seethamma-Vakitlo-Sirimalle-Chettu-New-Wallpaper

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’… ఇవాళ రాష్ట్రమంతా ఇదే జపం.. ఇదే జ్వరం.. ఇదే ధ్యానం.. ఇదే ధ్యాస… ఒక సాధారణ కుటుంబకథా చిత్రానికి ఇంతటి ఎదురుచూపులు అసాధ్యం.. కానీ ఇది సాధ్యమైంది. కోట్లాది కళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాయంటే అది ఈ సినిమాలో నటించిన ఇద్దరు అగ్ర హీరోల స్టామినా.. వాళ్ళకున్నఫాలోయింగ్. ఇద్దరు హీరోలలో ఒకరు సీనియర్ హీరో వెంకటేష్ కాగా, రెండో కథా నాయకుడు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో వున్న మహేష్ బాబు. అందుకే ఈ సినిమాకు మార్కెట్లో అంత క్రేజ్…. శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అటు మహేష్, వెంకటేష్ అభిమానులు మాత్రమే కాకుండా, కోట్లాది సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా షుమారు 1500 కు పైగా థియేటర్లలో రిలీజు కాబోతోంది. బుధవారం నాడు విడుదలయిన ‘నాయక్’ సినిమా సూపర్ హిట్ టాక్ ను స్వంతం చేసుకుని కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ‘నాయక్’ పూర్తిగా యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ ప్యాక్డ్ కాగా ‘సీతమ్మ’ కంప్లీట్ గా ఫ్యామిలి డ్రామా…. అమ్మా నాన్నా, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళ అనుబంధాలు, ఆత్మీయతలు, కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు సెంటిమెంట్స్ నిండిన సినిమా. ఈ రెంటికీ పొంతనే లేదు. కానీ రెండు సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కావటం, పైగా సంక్రాంతి సీజన్ కావటం వల్ల రెండింటికి అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఆడియో పరంగా ‘ సీతమ్మ ‘ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా పాటలు రాష్ట్రమంతటా ఇప్పటికే హోరెత్తిస్తున్నాయి. మిక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. పాటలకు తగ్గట్టుగా సినిమాలో సిట్యుయేషన్లు కూడా సరిగ్గా సమకూరితే ఈ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయినట్లే. సినిమా మొత్తం పూర్తయిన తరువాత ఈ సినిమాకు మణిశర్మ చేత రి రికార్డింగ్ చేయిస్తే న్యాయం జరుగుతుందని భావించిన నిర్మాత, దర్శకుడు ఆయనను సంప్రదించటం, ఆయన ఒకే చెప్పటం జరిగిపోయాయి. షుమారు నెలరోజులపాటు మణి ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తీసుకున్నట్టు తెలిసింది. సినిమా మూడ్ కు తగ్గట్టుగా మణి అద్భుతంగా రి రికార్డింగ్ చేసాడని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఈ సినిమా గురించి మణిశర్మ తెలుగు మిర్చి తో మాట్లాడుతూ ” ఇంటిల్లిపాది హాయిగా చూడదగ్గ మంచి సినిమా ఇది. నూటికి నోరు పాళ్ళూ ఫీల్ గుడ్ మూవీ. ఎంజాయ్ చేస్తూ రి రికార్డింగ్ చేసాను. మహేష్, వెంకటేష్ ఇద్దరూ పోటి పడి నటించారు. ప్రత్యేకించి మహేష్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పెద్ద పండగే. ” అన్నారు. సో.. తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సంక్రాంతికి ఒక మంచి సినిమా చూడబోతున్నారన్నమాట!

Exit mobile version