డిస్నీ హాట్ స్టార్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి HBO కంటెంట్ ప్రసారాలను నిలిపివేయనుంది. కంపెనీ కొత్త పాలసీ ప్రకారం ఆ కార్యక్రమాలను స్ట్రీమింగ్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఒక వీక్షకుడు డిస్నీ సంస్థను అడిగిన ప్రశ్నకు ఆ సంస్థ రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ ద్వారా స్పందించింది. పెర్రీ మాసన్ సీజన్ 2 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందని ఆ వీక్షకుడు ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆ సంస్థ ఇక నుంచి HBO కంటెంట్ లభ్యం కాదని స్పష్టం చేసింది.
ఇక 10 భాషల్లో లక్ష గంటల పాటు ఉన్న అనేక సినిమాలు, టీవీ షోలు, క్రీడా ఈవెంట్లను ఎంజాయ్ చేయవచ్చని డిస్నీ సంస్థ ట్వీట్ చేసింది. తమ సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు వాల్డ్ డిస్నీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డిస్నీ హాట్ స్టార్ సంస్థకు ఆసియాలోనే ఎక్కువ మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇండియాలో విపరీతంగా చందాదారులున్నారు. వారి సంఖ్య 61.3 మిలియన్ల నుంచి 57.5 మిలియన్లకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కాస్ట్ కటింగ్ విషయంలో దృష్టి సారించింది. కొన్ని సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది.