Gandhi Tatha Chettu : సుకుమార్ కూతురు ‘గాంధీ తాత చెట్టు’ జనవరి 24న విడుదల


Gandhi Tatha Chettu : దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తనయురాలు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన సందేశాత్మక చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

సాధారణంగా మనకు అహింస అనగానే మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఇకపోతే సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి గాను సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో, సుకృతి బెస్ట్ డెబ్యూటెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం మరియు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది.