తెలుగు హీరోలపైన ఇంత ప్రేమ ఉంటే… ముందు ఎందుకు అలా చేశారు రాజు గారు?


వారసుడు సినిమాని జనవరి 11 నుంచి జనవరి 14కి వాయిదా వేస్తున్నట్లు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తెలుగు వర్షన్ ని మాత్రమే వాయిదా వేస్తూ, తమిళ వర్షన్ ని జనవరి 11నే ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. కొత్త రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ “నా చుట్టూ ఉండే వాళ్ల వలన నేను చెప్పాల్సిన ఒక విషయం, అంతకన్నా ముందే బయటకి వచ్చేసింది. అందరూ అనుకుంటున్నట్లే వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తున్నాను. చిరంజీవి, బాలకృష్ణలు నటిస్తున్న సినిమాలని మన తెలుగు వాళ్లు ముందు చూడాలి. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి ఎక్కువ థియేటర్స్ దొరకాలి అందుకే వారసుడు సినిమాని వాయిదా వేస్తున్నాను. అది నాకు తెలుగు సినిమాలపైన, మన హీరోల పైన ఉన్న ప్రేమ” అన్నాడు. వారసుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిలే కారణంగానే వాయిదా పడుతుంది అనే కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అలాంటిది ఏమీ లేదని దిల్ రాజు స్పష్టం చేశాడు.

ఇక్కడి వరకూ అంతాబాగానే ఉంది కానీ తెలుగు హీరోల పైన, తెలుగు సినిమాలపైన అంత ప్రేమ ఉంటే ముందు నుంచీ ఎందుకు వెనక్కి తగ్గలేదు? రిలీజ్ డేట్ ని ముందే ఎందుకు అనౌన్స్ చేసావు? థియేటర్స్ ని ఎందుకు బ్లాక్ చేసావు? అంటూ దిల్ రాజుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినీ అభిమానులు ఇలా మాట్లాడుతూ ఉంటే తమిళ సినీ అభిమనులేమో “ఒక తెలుగు ప్రొడ్యూసర్ తో సినిమా చెయ్యడం కారణంగా విజయ్ సినిమా ఆరేళ్ల తర్వాత తెలుగు తమిళ భాషల్లో విడుదల కావట్లేదు. ఇకపై విజయ్ తెలుగు ప్రొడ్యూసర్స్ తో సినిమా చెయ్యకూడదు” అనే కామెంట్స్ మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల సినీ అభిమానుల దృష్టిలో దిల్ రాజు ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాడు.