డియర్ కామ్రేడ్ ట్రైలర్ టాక్ : అర్జున్ రెడ్డి అమ్మ మొగుడిలా ఉన్నాడే ?

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసమే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఇప్పటికే గీత గోవిందం సినిమాతో రొమాంటిక్ జోడీ అనిపించుకున్న జంట కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. మూడు నిముషాల ఈ ట్రైలర్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమకి దూరమయ్యి మానసిక సంఘర్షణ అనుభవించే ఓ యువకుని కథగా చెప్పాలి. బాబీ(విజయ్) చిన్నప్పటి స్నేహితురాలైన లిల్లీ(రష్మిక) స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. పెద్దయ్యాక మళ్ళీ కలుసుకున్న వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ కమ్యూనిజం భావాలున్న విజయ్ గొడవలు, పోరాటాలు వీరిమధ్య అడ్డుగా నిలుస్తాయి.

చివరకు ప్రేమా,సమాజమా అనే ఆలోచనలో ప్రేమను వదిలేసి పోరాటం వైపు వెళ్లిన విజయ్ కొన్నేళ్ల తరువాత మళ్ళీ ప్రేమ కావాలంటూ ప్రేమించిన అమ్మాయి కొరకు వెళతాడు. ఈ ప్రేమ, పోరాటాల మధ్య తన లక్ష్యం ఎలా సాధించాడన్నదే కథ. డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ సినిమా మీద అంచ‌నాల‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమాతో మ‌రోసారి చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తున్నాడు అర్జున్ రెడ్డి.