డౌటు లేదు… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు. మంచి, చెడు… ఏదొచ్చినా – వివాదం, విజయం ఏది ఎదురైనా… ఆయన ముందు వాలిపోవలసిందే! పాఠాలు చెప్పకపోయినా.. ప్రతి ఒక్కరికీ గురువే. పరిచయం లేకపోయినా అందరికీ మార్గ దర్శకుడే! కానీ కొంతకాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. వివాదాల జోలికి వెళ్లడం లేదు. విమర్శలు గుప్పించడం లేదు. అటు రాజకీయంగానూ ప్రకంపనలు లేవు! మౌన మునిలా మారి – తన పనిలో తానున్నారు. కారణం తెలీదు గానీ.. చిత్ర పరిశ్రమ కూడా ఆయనకు కాస్త దూరంగానే ఉంది. దాసరి ఇంటి దగ్గర ఎప్పుడూ ఉండే హడావుడి కనుమరుగైంది. పరామర్శలూ, పలకరింపులూ, పూలదండలూ, పిలుపులూ.. ఇవన్నీ కాస్త తగ్గాయి. దాసరి క్రేజ్ ఏమైనా తగ్గిందేమో ?? అనే అనుమానం జనాల్లో మొదలైంది. పరిశ్రమ ఆయన్ని లైట్ తీసుకొంటుందేమో అనే సందేహాలూ వచ్చాయి. కానీ మే 4 ఉదయం… అవన్నీ పటాపంచలైపోయాయి. దాసరి.. దాసరే! అనే నిజం మరోసారి తెలిసొచ్చింది. కారణం… సింపుల్! ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఆయన ప్రతి పుట్టిన రోజుకీ ఇంటి దగ్గర హడావుడి ఉంటుంది. కానీ ఈరోజు.. దాసరి ఇంటి దగ్గర జాతరే! ఉదయం నుంచీ జనం వస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. వాళ్లూ వీళ్లూ అని లేదు. యావత్ చిత్ర పరిశ్రమ దాసరి ఇంటి దారి వెతుక్కొంటూ వెళ్లింది. రాజకీయ నాయకుల కార్లు కుయ్.. కుయ్ మంటూ అక్కడే ఆగాయి. జనం వస్తున్నారు. వస్తున్నారు. రాత్రయినా వస్తూనే ఉన్నారు. సడన్‌గా దాసరి క్రేజ్ ఇన్ని రెట్లు ఎందుకు పెరిగింది? దాసరి ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. దర్శకుడిగా మళ్లీ ఆయన బిజీ అవుతున్నారు. పరిశ్రమలో ఆయన మళ్లీ సంచలనాలు సృష్టించడానికి సిద్దం అవుతున్నారనే సంకేతాలు అందరికీ అందేశాయి. సినిమా వాళ్ల తాకిడికి అదో కారణం కావచ్చు. రెండోది.. రాజకీయంగా ఆయన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఆయన పార్టీకి బలం. ఆయన్ని దూరం చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. అందుకే… ఆయన ఆశీస్సుల కోసం అందరూ క్యూ కట్టారు. ఏదైతేనేం.. దాసరి మళ్లీ జూలు విదిల్చారు. అటు సినిమాలూ, ఇటు రాజకీయాలూ రెండింటిపై తన ప్రతాపం చూపించడానికి సన్నద్ధం అవుతున్నారు. నిజంగా దాసరికి ఇది నిజమైన పుట్టిన రోజు.