దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, కధకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా జర్నలిస్టుగా , పత్రికాధిపతిగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, రాజకియవేత్తగా మాత్రమే కాదు ఒక మంచి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా దాసరి నలు దిశలా, పలుదిశలా వ్యాపించారు… విస్తరించారు.. ఆయనదో విలక్షణ వ్యక్తిత్వం. అరుదైన మనస్తత్వం… ఏది వచ్చినా వచ్చినా పొంగిపోడు… ఏది రాకపోయినా కుంగిపోడు…. ఉదాహరణకు కేంద్రమంత్రి వస్తే ఎగిరిపడలేదు.. పద్మ పురస్కారం రాకపోతే కుంగిపోలేదు… జీవితంలో అలా బ్యాలెన్స్ చేసుకోగలగటం దాసరి కి భగవంతుడిచ్చిన వరం.
తన దగ్గరకు వచ్చింది పెద్దవాడయినా చిన్నవాడయినా సాదరంగా ఆహ్వానిస్తారు… సమాదరంగా సమస్యను విని వాటిపరిష్కారానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రయత్నిస్తే కాని పని వుండదు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఆయన ఒక వ్యవస్థ… ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకే పరిగెడతారు… ఆయననే ఆశ్రయిస్తారు… అందుకే ఫిలిమ్ చాంబర్ల దగ్గర కంటే, నిర్మాతల మండలి దగ్గర కంటే ఆయన ఇంటిదగ్గర ఎక్కువ జనం కనపడతారు. ఆయన దేన్నయినా భరిస్తారు గాని తన ఈగొను ఎవరైనా దెబ్బ తీస్తే సహించరు. దాసరి లో నిలువెత్తు అహంకారం వుంది. గొప్ప వ్యక్తికి అహంకారం అందం… అవసరం కూడా.. రహస్యం ఏవిటంటే ఆయన అహంకారిలా కనపడతారు గాని, కొంచెం చేరువ కాగలిగితే ఆయనంత చిన్నపిల్లాడు లేడు అనేది ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. ఆయన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా ఆయన దగ్గరకెళ్ళి” అన్యధా శరణం నాస్తి ” అంటే అంతలో కరిగిపోయి అక్కున చేర్చుకుంటారు.
దాసరి భోళా శంకరుడు. చిన్న సినిమాలకు ఆయన ఎప్పుడూ పెద్దదిక్కే. చిన్న నిర్మాతల సమస్యలను భుజాన వేసుకుని వాటి పరిష్కారానికి సమరం చేసే నిరంతర పోరాటం ఆయనది. సభల్లో, సమావేశాల్లో ఆయన ఏం మాట్లాడినా చర్చనీయాంశమే. ఎవరినీ వదిలి పెట్టరు. ఎవడినీ ఖాతరు చేయరు. అదో తరహా తెగింపు. వ్యక్తిత్వ పరంగా వచ్చిందే గాని తెచ్చి పెట్టుకుంది కాదు. మే నాలుగవ తేది దాసరి పుట్టినరోజు.. పరిశ్రమ అంతా అక్కడే వుంటుంది. అందరికి పండగే.. ఆ ఉన్నత వ్యక్తిత్వానికి, సంస్కారానికి నమస్కరిస్తూ ఆయనకుతెలుగుమిర్చి. కామ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు అందిస్తోంది. లాంగ్ లివ్ మై డియర్ సర్.. !