Site icon TeluguMirchi.com

రివ్యూ : దాస్ కా ధమ్కీ



తెలుగు మిర్చి రేటింగ్: 2/5

ఎన్నికల్లో ఓట్లు అడగానికి ఎదో ఒక నినాదం వుండాలి. ఎదో ఒక బలమైన ప్రచారస్త్రం దొరకాలి. సినిమాకి కూడా అంతే. ఎదో రకంగా సినిమా పై బజ్ క్రియేట్ చేయాలి. ఈ విషయంలో విశ్వక్ సేన్ బాగా ఆరితేరిపోయాడు.

విశ్వక్ సేన్ ప్రతి సినిమాకీ ఎదో ఒక పబ్లిసిటీ ఆయుధం దొరుకుతుంది. దాస్ కా ధమ్కీ కి అతను వాడిని అస్త్రం.. ఈ సినిమా కోసం సంపాదించింది అంతా పెట్టేశానని. ఆయన చెప్పడం కాదు.. ఎన్టీఆర్ తో కూడా చెప్పించాడు.

మరి సర్వస్వం పెట్టేయాలనిపించినంత గొప్ప కథ దాస్ కా ధమ్కీ లో ఏముందా అని చూస్తే.. చిన్నప్పటి నుంచి చూసిన డబల్ యాక్షన్ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ మధ్యే తల బొప్పికట్టించేసిన అమిగోస్, ఆ మధ్య ఎప్పుడో వచ్చిన గౌత‌మ్ నందా,.. ఒక్కటి కాదు డబుల్ యాక్షన్ సినిమాలన్నీ .. ఫ్లాష్ బ్యాక్ రింగురింగుల ఎఫెక్ట్ లో గిర్రున తిరుగుతాయి.

పోనీ డబుల్ యాక్షన్ కథ నడిపారా అంటే.. అదీ లేదు.. సినిమా ఫస్ట్ కి కథ రాసుకోలేదు. ఒక పేదోడు ధవంతుడిలా నటించడం.. సినిమా కెమరా కనుక్కున్నప్పటి నుంచి ప్రేక్షకులు చూస్తున్నారు కదాని.. అదే తిప్పితిప్పి చూపిస్తున్నారు. పండగ పూట కూడా ఫస్ట్ హాఫ్ కి ఇదే చూడండి అన్నాడు విశ్వక్.

ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లకు తెర లేపారు. అయితే ఈ ట్విస్ట్ లు ఎలిమెంటరీ పిల్లలకి కూడా పావు గంట ముందే అర్ధమైపోతాయి. పాపం.. ఇందులో దాస్ చాలా అమాయకుడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా అంతే అమాయకునె అనే అతి విశ్వాసంతో ఆ ట్విస్ట్ లని డిజైన్ చేశారు. ఏదైనా ట్విస్ట్ రివిల్ అయినప్పుడు వావ్.. అనిపించాలి. దాస్ లో ట్విస్ట్ లు మాత్రం.. ఇక చాలు అనిపిస్తాయి.

రెండు పడవల ప్రయాణం వద్దు అంటారు పెద్దలు. విశ్వక్ మూడు పడవల ప్రయాణం చేశాడు. అయితే కాసేపు హీరో గా , కాసేపు డైరెక్టర్ , ఇంకాసేపు నిర్మాతగానే ప్రయనించాడు కానీ ఏ ప్రయాణాన్ని కూడా పూర్తి చేయలేదు. సీతమ్మ వాకిట్లో రావురమేష్ చెప్పినట్లు.. అన్ని సగం సగం పనులు.

టెక్నికల్ గా మాత్రం సినిమా బావుంది. కెమరాపని తనం, మ్యూజిక్ డీసెంట్ గా వుంది. ఆర్ట్ వర్క్ మాత్రం అర్టిఫిషియల్ గా వుంది. ఇందులో చూపించిన ఓ ఇల్లు పూరాతన వస్తువులు దాచుకునే గోడాన్ లా వుంటుంది. అందులో మనుషుల్ని చూడగానే డ్రామా వేయడానికి వచ్చారా ?అనిపిస్తుంది తప్పితే ఇంట్లో వున్న మనుషుల్లా అనిపించరు. ఇందులో ట్విస్ట్ లు తేలిపోవడానికి ఇదొక కారణం.

విశ్వక్ తప్పితే గొప్పగా నటించిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. నివేదా యాక్టింగ్ మర్చిపోయినట్లు యాక్ట్ చేసింది. హైపర్ ఆది, మహేష్ పేల్చిన డైలాగులకు జబర్దస్త్ సౌండ్ ఎఫెక్ట్ లు వేయడం మర్చిపోయారు.. అందుకే పెద్దగా నవ్వురాలేదు.

అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ వుందని చెప్పడానికి విక్రమ్ స్టయిల్ భారీగా జనాలని పోగేసి.. ఒక సీన్ ని కండక్ట్ చేశాడు విశ్వక్. దీనికి వలన సీక్వెల్ పై ఆసక్తి పెరగలేదు కానీ.. తనని తాను మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్న పెట్టుబడని మాత్రం క్లియర్ గా అర్ధమైయింది.

ఫినిషింగ్ టచ్: టైటిల్ లో వున్న సౌండ్ సినిమాలో లేదు.

Exit mobile version