మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ పాత్రలో నటించిన ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సెప్టెంబర్ 13వ తారీకున విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంపై వివాదం కూడా రాజుకుంటూ ఉంది. గతంలోనే ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్‌ను పెట్టడంపై భోయ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ అభ్యంతరంను పట్టించుకోకుండా దర్శకుడు హరీష్ శంకర్ తనపని తాను అన్నట్లుగా చేసుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు సినిమా విడుదలకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో సినిమా మళ్లీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది.
ఒక కమర్షియల్ సినిమాకు భోయలు ఆరాధ్యదైవంగా భావించే వాల్మీకి పేరును పెట్టడంను ఆ సంఘ వారు తప్పుబడుతూ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో సినిమా వివాదం ప్రస్తుతం కోర్టుకు ఎక్కింది. భోయల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం టైటిల్ ఉందంటూ వారు కోర్టులో చెబుతున్నారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కూడా ఈ సందర్బంగా సదరు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం నుండి వాల్మీకి ఎలా బయట పడతాడో చూడాలి.