ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) కొద్దీ సేపటి క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు (ఏప్రిల్ 06) తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు తమ్మారెడ్డి కి ఫోన్ కాల్ ద్వారా పరామర్శిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయన రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మధాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు తదితర అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం.
మాతృమూర్తిని కోల్పోయిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో తన తల్లి రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని ఆయన కోరడం జరిగింది.