చిరు స్థానం పవన్ దా? చరణ్ దా?

Chiranjeevi pavankalyan charanచిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక.. ‘మెగాస్టార్’ స్థానం ఖాళీ అయిపోయింది. ఇప్పట్లో ఆయన మేకప్ వేసుకొనే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మూడ్ మార్చుకొని.. కెమెరా ముందుకొచ్చే వరకూ ఆ కుర్చీ ఖాళీనే. అయితే మెగా అభిమానుల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. రామ్ చరణ్ లో వాళ్లు చిరుని చూసుకుంటున్నారు. చరణ్ సినిమా అంటే చిరంజీవి నుంచి వస్తున్న మరో సినిమానే అనే లెక్కలేసుకొంటున్నారు. చిరంజీవి కూడా అదే మాట చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. “చిరుత నా 148వ సినిమా అనుకొన్నర”ని చెప్పారు కూడా. ‘తనయుడే వారసుడు’ అనే సూత్రం ఎలాగూ మనకు పాతదే. మరి మెగాస్టార్ పీఠం…. చరణ్ కి ఇచ్చేస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ పోటీకొస్తున్నారా? ఇంతకీ ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఎవరికుంది?

Naayak-Movieరామ్ చరణ్ ఈ మధ్యే తన మనసులోని మాట బయట పెట్టారు. ‘నాన్న తరవాత నేను కాదు…బాబాయ్ పవన్ కల్యాణే’ అన్నారు. చెర్రీ ఏ ఉద్దేశంతో అన్నాడో గానీ, ఇప్పుడా మాట హాట్ టాపిక్ గా మారింది. అంటే.. చిరు ప్లేస్ పవన్ దా? ! చరణ్ కి దక్కదా? అనే మీమాంశలో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నిజానికి మెగాస్టార్ స్థానం ఎవ్వరూ భర్తీ చేయనిది. దానికి వారసత్వంతో పనిలేదు. బాక్సాఫీసుని షేక్ చేసే సత్తా ఉండాలి. కేవలం తన ఇమేజ్ తోనే సినిమా నడిపించే స్టామినా ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే.. మెగాస్టార్ కాగలడు.

Pawan Kalyanచిరు ఇంటి నుంచి మొట్టమొదట సినిమాల్లోకి వచ్చింది పవన్ కల్యాణ్. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమైంది. తొలి సినిమాకి చిరు తమ్ముడు అనే ట్యాగ్ లైన్ వాడుకొన్నాడు. గానీ.. ఆ తరవాత ఆ ఊసే ఎత్తలేదు. సినిమా సినిమాకీ తానేంటో నిరూపించుకొని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకొన్నాడు. చిత్రం ఏమిటంటే.. మిగితావారిలా వంశ పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొని సినిమాలు నడిపించలేదు. ఆ తరహా సంభాషణలు పవన్ సినిమాల్లో అస్సలు కనిపించవు. కనీసం పవన్ చిరు సినిమాల్లోని పాటల్ని రీమిక్స్ చేసే ప్రయత్నాలూ చేయలేదు. ఇంకా చిత్రం ఏమిటంటే చిరునే పవన్ ని అనుకరించే ప్రయత్నం చేశారు. ‘శంకర్ దాదా’ చూశారు కదా? అందులో ‘నీకెవరంటే ఇష్టం..’ అంటూ ఖుషీలో తమ్ముడిని కాపీ కొట్టారు చిరు. అది అభిమానులకు విపరీతంగా నచ్చింది.

Ram-Charanచరణ్ అలా కాదు. వీలైన ప్రతీసారి, ఆ మాటకొస్తే వీల్లేనప్పుడు కూడా.. తండ్రి పేరుని వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘బంగారు కొడిపెట్ట’, ’వానా వానా వెల్లువాయె’, ‘శుభలేఖ రాసుకొన్న’ పాటల్ని రీమిక్స్ చేసుకొన్నారు. సినిమాలో కనీసం నాలుగైదు సన్నివేశాల్లో అయినా చిరుని గుర్తుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘రచ్చ’లో ఆయన అచ్చం చిరంజీవిలానే నటించేశారు. ‘నా అబ్బ జోలికొస్తే అడ్డంగా నరికేస్తా’ అని అభిమానుల్ని అలరించారు. దీన్ని బట్టి… తండ్రి స్థానంలో రావడానికి చరణ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. డాడీ లేని లోటు భర్తి చేయడానికి విపరీతంగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ‘నాయక్’ పాటల వేడుకలో విపరీతంగా ఎగ్జైట్ అయిపోయి ‘డాడీ తరవాతా బాబాయ్’ అని నోరు జారిపోయాడు.

Chiranjeevi-Pawan-Kalyan-and-Ram-Charan-Tejaచిరంజీవి అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల మరెవ్వరిలోనూ చూళ్లేం. మెగాస్టార్ అర్హత ఆయనకే ఉంది. ఈ స్థానానికి రావడం వెనక ఆయన పాతికేళ్ల శ్రమ దాగుంది. దాన్ని అయిదో సినిమాకే చరణ్ కి కట్టబెట్టడం సాహసమే. చరణ్ ప్రతిభావంతుడే. కానీ ప్రయాణించాల్సింది, నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ముఖ్యంగా కమిట్ మెంట్ అంటే ఏమిటో నాన్న నుంచి ఇంకా తెలుసుకోవాలి. మీడియాతో ఎలా మెలగాలో, పెద్దలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ‘మీడియా నాకు వెంట్రుకతో సమానం’లాంటి తప్పుడు స్టేట్ మెంట్లు చరణ్ ఎదుగుదలకు అడ్డుగోడే. చిరంజీవి తన మూడు దశాబ్దాల ప్రయాణంలో ఒక్కసారి కూడా… తప్పుగా మాట్లాడలేదు. ఆఖరికి ఆవేశపూరితంగా కనిపించే పవన్ కూడా మీడియాని గౌరవించాడు. మరి చరణ్ కి అంత ఆవేశం ఎందుకొచ్చినట్టు? ‘మగధీర’;లాంటి విజయాలతో దూసుకుపోవడం వరకూ ఓకే! కానీ మెగాస్టార్ స్థానం విజయాలతో కొలవలేం. స్వీయ నియంత్రణ కూడా అవసరం. అది చరణ్ తో పోలిస్తే పవన్ లో చాలా ఉంది. అందుకే చిరంజీవి స్థానానికి తమ్ముడే అర్హుడనేది సినీ ప్రముఖుల మాట. చరణ్ కీ ఆ స్థాయి రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఆ స్థానానికి చెర్రీ ఎప్పుడు చేరుకొంటాడో అప్పుడు నిరభ్యంతరంగా మెగాస్టార్ కిరీటం అప్పగించవచ్చు. ఆ క్షణాల కోసం ఎదురు చూద్దాం.