అప్పుడు బాలకృష్ణ కోసం వచ్చింది, ఇప్పుడు చిరంజీవి కోసం వచ్చేనా?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రంను తెరకెక్కించాడు. ఇక ఈచిత్రం కోసం ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేస్తున్నారు. ఈనెల 22న సైరా ప్రీ రిలీజ్‌ వేడుక జరుపబోతున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియం సిద్దం అవుతోంది. మొదట ఈ వేడుకను రేపే అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల 22కు మార్చారు.

ఇక ఈ చిత్రంలో నటించిన నయనతార ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొంటుందా లేదా అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే నయనతార ఎంత పెద్ద సినిమాలో చేసినా కూడా ఆమె ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనేందుకు ఆసక్తి చూపించదు. అలాగే సైరా విషయంలో కూడా ఆమె చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలకృష్ణతో నటించిన శ్రీరామ రాజ్యం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో నయనతార పాల్గొంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా ఆమె కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు సైరా కోసం ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి.