విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో విజయ్ తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. బిచ్చగాడు 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోం బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన యాంటీ బికిలి థీమ్ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా బిచ్చగాడు 2 నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం.
‘చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను.. చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టూ మచ్చై ఉంటా తోడూ’ అంటూ సాగిన ఈ సాంగ్ గుండెలను పిండేస్తోంది. అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో ఈ సాంగ్ సాగుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చే ఈ పాటను భాష్య శ్రీ రాయగా.. విజయ్ ఆంటోనీ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడాడు. ఇక బిచ్చగాడు 2ను విజయ్ ఆంటోనీయే స్వయంగా డైరెక్ట్ చేస్తూ.. సంగీతమందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో హరీష్ పేరడి, కావ్య థాపర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే మొదటి పార్ట్ లో తల్లి సెంటిమెంట్ తో వచ్చి హిట్ అందుకున్న విజయ్.. రెండో పార్ట్ లో చెల్లి సెంటిమెంట్ తో రాబోతున్నాడు.