Site icon TeluguMirchi.com

మోహన్‌బాబుపై మహిళ న్యాయ పోరాటం

హీరోగా, నిర్మాతగానే కాకుండా మోహన్‌బాబు స్కూల్‌ అధినేతగా కూడా సుపరిచితుడు. తిరుపతితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోహన్‌బాబు కుటుంబంకు చెందిన శ్రీవిద్య నికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ఆ స్కూల్స్‌కు సంబంధించిన కొన్ని వివాదాలు గతంలో మనం చూశాం. ఇప్పుడు కాస్త కొత్త తరహా వివాదం మీడియా ముందుకు వచ్చింది. తిరుపతి స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న రాణి రవడను ఇటీవల ఉద్యోగం నుండి తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తనను తొలగించడంపై ఆ టీచర్‌ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తోంది.

స్కూల్‌ నియమావళికి విరుద్దంగా ఆమె ఫార్మల్‌ డ్రస్‌ కాకుండా పాయింట్‌, షర్ట్‌ వేసుకు రావడం వల్ల తొలగించినట్లుగా స్కూల్‌ యాజమాన్యం చెబుతుంది. అయితే రాణి రవడ మాత్రం తాను చేసిన దాన్ని సమర్ధించుకుంటుంది. స్కూల్‌లో ఇతర టీచర్లు పాయింట్‌, షర్ట్‌ వేసుకున్నా కూడా పట్టించుకోని యాజమాన్యం తనను మాత్రం ఎందుకు ఇలా తొలగించిందని, తనను అవమానిస్తూ, అగౌరవంగా తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. తనను మళ్లీ ఉద్యోగంలో జాయిన్‌ చేసుకోవాల్సిందిగా శ్రీవిద్యానికేతన్‌ స్కూల్‌కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆమె కోర్టును కోరింది. ఈ విషయమై ఇరు వర్గాల వాదనలు వినాల్సి ఉండగా కేసును వాయిదా వేయడం జరిగింది. ఈ కేసు విషయంలో మోహన్‌బాబు కుటుంబ సభ్యుల ఇంకా స్పందించలేదు.

Exit mobile version