రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కన్ను సినిమా పెద్దలపై పడిందా ? అవుననే అంటున్నాయి అభిజ్ఞవర్గాలు. దివంగత ముఖ్యమంత్రులు విజయభాస్కరరెడ్డి, ఎన్ టి రామారావు తదితరుల హయాంలో అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, కె. రాఘవేంద్రరావు, ఎం.ఎస్. రెడ్డిలకు స్టూడియోలు తదితర సినిమా అనుబంధ కార్యక్రమాల నిమిత్తం స్థలాలు కారు చౌకగా కేటాయించారు. అప్పట్లో ఎకరం రూ. 8,500 ల చొప్పున ఈ స్థలాలను అప్పటి ముఖ్యమంత్రులు కేటాయించారు. వాటిలో అక్కినేని, కృష్ణ లు స్టూడియో లు నిర్మించగా, ఎం.ఎస్.రెడ్డి రికార్డింగ్ స్టూడియోను నిర్మించారు. ఒక్క రాఘవేంద్రరావు మాత్రం ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ స్థలాలన్నీ ఏ ఉద్దేశ్యంతో కేటాయించారో వాటికోసమే తప్ప వ్యాపార పరమైన వాటికి వినియోగించకూదదన్న నిబంధన వుంది. ఈ విషయమై పద్మాలయ స్టూడియో పై తెరాస నాయకుడు కేసు కూడా వేసి వున్నారు. ఈ నేపధ్యంలో వందల కోట్ల విలువైన ఈ స్థలాపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్థలాలకు సంబంధించిన సమగ్ర నివేదికను తనకు వెంటనే సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సచివాలయవర్గాల సమాచారం. వీరిలో కృష్ణ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడై వుండగా, దివంగత ఎంఎస్ రెడ్డి తనయుడు శ్యాం ప్రసాద్ రెడ్డి స్వర్గీయ విజయభాస్కరరెడ్డి కి స్వయానా అల్లుడు. కె. రాఘవేంద్రరావు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఇక అక్కినేని అయితే తాను చంద్రాబాబుకు అభిమానిని అని బహిరంగంగానే గతంలో ప్రకటించి వున్నారు. కాని ఆయన కుమారుడు నాగార్జున మాత్రం ఇటివల పలు పర్యాయాలు తన భాగస్వామి మ్యాట్రిక్స్ ప్రసాద్ ను చంచల్ గూడా జైలు లో కలిసిన సందర్భంగా అక్కడే వున్న జగన్ ను కూడా కలిసారని వదంతులు వ్యాపించాయి. ఆ తరువాత నాగార్జున కు జగన్ వ్యాపారాలతో సంబంధాలున్నాయని, దీనిపై సి బి ఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ కూడా డిమాండ్ చేసింది. ఈ నేపధ్యంలో సినిమా వాళ్లకు గత ప్రభుత్వాలు కేటాయించిన స్థలాల వ్యవహారాన్ని పునఃస్సమిక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు సమాచారం.