లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సామాజిక స్పృహ కలిగిన సినిమా ‘దండోరా’ ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే యాక్టర్ శివాజీ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి బిందు మాధవి కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమె ఈ సినిమాలో ఓ భావోద్వేగంతో కూడిన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, సమాజంలోని కట్టుబాట్లను, వర్గవివక్షలను వెదజల్లేలా సాగుతుంది. అగ్ర వర్ణాల నుండి వచ్చిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదా ఎదురు తిరిగినా ఎదురవుతున్న దౌర్జన్య ఘటనల్ని ప్రస్తావిస్తూ, హాస్యం, వ్యంగ్యం, సంస్కృతి, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బీట్ వీడియోతో ‘దండోరా’పై అంచనాలు పెరిగాయి. బిందు మాధవి, శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక విభాగాల్లో ప్రముఖుల సమిష్టి శ్రమ కనిపిస్తోంది. మార్క్ కె. రాబిన్ సంగీతాన్ని అందించగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరక్షన్, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఎడ్వర్డ్ పేరజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అనీష్ మరిశెట్టి కో ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. మేకర్స్ త్వరలోనే మరిన్ని ఆసక్తికర వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.