Site icon TeluguMirchi.com

పెద్ద హీరోలు వ‌ణికిపోతున్నారు!

big herosపెద్ద హీరో సినిమా అంటే నిర్మాత‌లు హైవేపై ప్రయాణ‌మే. విడుద‌ల‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌వు. ఫ్రీ ప‌బ్లిసిటీ. సినిమా ఎలా ఉన్నా చూడ్డానికి అభిమానులు పోటీ ప‌డ‌తారు. దాంతో ప్రారంభ వ‌సూళ్లు ఫుల్లు. సినిమా బాగుంటే రికార్డులు కొల్ల‌గొట్టడం ఖాయం. అయితే ఇప్పుడు ఈ లెక్కలు మారుతున్నాయి. పెద్ద హీరోతో సినిమా అంటే నిర్మాత‌లు వ‌ణుకు తున్నారు. బ‌య్యర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఆల్రెడీ సినిమాలు తీసిన వాళ్లు త‌ల‌లు ప‌ట్టుకొంటే – ఇంత‌కాలం పెద్ద హీరోల డేట్ల కోసం ఎదురుచూసిన నిర్మాత‌లు ఇప్పుడు లైట్ తీసుకోవ‌డ‌మే బెట‌ర్ అనుకొంటున్నారు. ఎన‌భై ఏళ్ల తెలుగు సినీ చ‌రిత్రలో ఎప్పుడూ ఇలాంటి సీన్ ఎవ‌రూ చూళ్లేదు. ఇప్పటి ఈ ప‌రిస్థితికి కార‌ణం ఏమిటి??

సీమాంధ్ర ఎఫెక్ట్‌… ఇంత దారుణంగా ఉంటుంద‌ని సినిమావాళ్లు క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. తుఫాన్ రిజ‌ల్ట్ చూసి ధైర్యం చేద్దామ‌నుకొన్నవాళ్లు కూడా వెన‌కంజ వేస్తున్నారు. సినిమా పూర్తయి విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, రేపో మాపో పూర్తవుతాయి అనుకొన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రక‌టించ‌డానికి మీన మేషాలు లెక్కపెడుతున్నాయి. ఎవ‌డు, అత్తారింటికి దారేది, భాయ్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, మ‌సాలా – ఇలా ఏ పెద్ద సినిమా అయినా తీసుకోండి. ఫ‌లానా టైమ్‌లో క‌చ్చితంగా రిలీజ్ చేసి తీర‌తాం… అని ఏ నిర్మాత కూడా ధైర్యంగా చెప్పలేక‌పోతున్నాడు. ఈ సినిమాల‌దే కాదు. రేప‌టి రోజున ఫిల్మ్‌న‌గ‌ర్‌లో త‌యార‌య్యే ప్రతి పెద్ద సినిమాదీ ఇదే ప‌రిస్థితి.

రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న హీరోలు – వారి కుటుంబ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే రాస్త్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్పలేని ప‌రిస్థితి. ఆంధ్రా – తెలంగాణ వైష‌మ్యాలు ఇలాగే కొన‌సాగితే ఓ స‌మ‌స్య‌. విడిపోయి రెండు రాష్ట్ర్రాలు ఏర్పడితే మ‌రో స‌మ‌స్య‌. ఎవ‌రు ఏ ఉద్యమానికి స‌పోర్ట్ చేశారు..? అనేదానిపైనే ఆ సినిమా ఫ‌లితం ఆధార ప‌డి ఉండ‌డం ఎంత దారుణం? ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాని విడుద‌ల చేయ‌డానికి, అస‌లు సినిమాలు తీయ‌డానికి స‌ద‌రు నిర్మాత‌ల‌కు ఎంత ధైర్యం ఉండాలి? ఎంత గుండె నిబ్బరం కావాలి? రేప‌టి రోజున తెలుగు హీరోలు, తెలుగు ప‌రిశ్రమ కూడా ఆంధ్రా, తెలంగాణ‌గా విడిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఆంధ్రా హీరోల సినిమాలు కేవ‌లం ఆ ప్రాంతంలోనే విడుద‌ల‌వుతాయి. తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడిన వాళ్ల సినిమాలు నైజాంలోనే ఆడ‌తాయి. ఇది చిత్ర ప‌రిశ్రమ‌కు మంచి ప‌రిణామం కానే కాదు. యాభై కోట్ల సినిమాలు మ‌రుగున ప‌డిపోతాయి. నైజాం మార్కెట్‌ని బ‌ట్టి, ఇక్కడొచ్చే వ‌సూళ్లని బ‌ట్టే బ‌డ్జెట్‌… అని లెక్కగ‌ట్టే రోజులొస్తాయి. రాజకీయ నేపధ్యం వున్న ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు తీయ‌డం అతి పెద్ద రిస్క్ అనే ధోర‌ణి మొద‌ల‌వుతుంది. ఇవ‌న్నీ అభూత క‌ల్పన‌లు, ఊహాజ‌నితాలూ కావు. రేప‌టి స‌త్యాలు.

Exit mobile version