కామ్రేడ్‌ డైరెక్టర్‌ 12 ఏళ్ల కష్టాలు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్‌ దేవరకొండతో సినిమా అంటే మామూలు విషయం కాదు. స్టార్‌ డైరెక్టర్స్‌ కూడా విజయ్‌ దేవరకొండ డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటిది భరత్‌ కమ్మ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రి మూవీస్‌ వంటి పెద్ద బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించింది. దాంతో మొదటి సినిమాతోనే భరత్‌కు స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ వచ్చింది. ఎంతో మంది పదుల సినిమాలు చేస్తున్నా కూడా రాని గుర్తింపు భరత్‌కు మాత్రం ఒక్క సినిమాతోనే వచ్చింది అంటూ కొందరు కుళ్లుకోవడం కూడా జరుగుతుంది.

మొదటి సినిమాతోనే ఇంతటి గుర్తింపు దక్కించుకున్న భరత్‌ కమ్మ అల్లాటప్పాగా ఈ స్థాయిలోకి రాలేదు. తాజాగా ఆయన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను దర్శకుడిగా అయ్యేందుకు 12 ఏళ్లు కష్టపడ్డాను. యూఎస్‌లో ఎంఎస్‌ చేసే అవకాశం వచ్చింది, ఇంటర్వ్యూ కూడా పూర్తి అయ్యింది. అలాంటి సమయంలో దర్శకత్వంపై ఆసక్తితో సినిమాను చేసేందుకు వచ్చాను. నా కుటుంబ సభ్యులు నన్ను నమ్మారు. అయితే నా మొదటి సినిమా విడుదల సమయంకు నాన్న గారు లేకపోవడం నాకు బాధ కలిగించే విషయం. ఆయన సినిమా షూటింగ్‌ మద్యలో ఉన్న సమయంలో మృతి చెందారు. ఆయన సినిమా చూడలేదనే బాధ నాకు జీవితాంతం ఉంటుందని భరత్‌ అన్నాడు.