బాల‌య్య ఇలా చేస్తున్నాడేమిటి…?

balayyaఏంటో… నంద‌మూరి ఫ్యాన్స్ త‌మ హీరో విష‌యంలో హ్యాపీగా లేరు. సింహా త‌ర‌వాత అన్నీ ఫ్లాపులే వ‌చ్చాయి బాల‌య్యకు. శ్రీ‌మ‌న్నారాయ‌ణ త‌ర‌వాత మ‌రో సినిమా మొద‌లెట్టడానికి యేడాది ప‌ట్టింది. మొత్తానికి మొద‌ల‌య్యింది అనుకొంటే ఆ సినిమా షూటింగ్ కూడా న‌త్తన‌డ‌క‌లా సాగుతోంది. అది చాల‌ద‌న్నట్టు మ‌ధ్యలో బాల‌య్య అమెరికా ప్రయాణం క‌ట్టాడు. దాంతో సినిమా మొద‌ల‌వ్వకుండానే ఆగిపోయింది. వచ్చిన త‌ర‌వాత షూటింగ్ మొద‌లైంది. ప్రస్తుతం జోరుగానే సాగుతున్నా త్వర‌లో మ‌ళ్లీ స్పీడ్ బ్రేక‌ర్లు ప‌డ‌నున్నాయి. ఎందుకంటే బాల‌కృష్ణ బ‌స్సు యాత్ర ప్రారంభించ‌నున్నాడు. ఆ పేరుతో మరో నెల రోజులు షూటింగ్‌కి డుమ్మా కొట్టడం ఖాయం. ఇలాగైతే సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా? అటు రాజ‌కీయాలు, ఇటు సినిమా అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్రయాణం ఎంత వ‌ర‌కూ కుదురుతుంది?? పార్టీ ప‌నుల్లో ప‌డి బాల‌య్య సినిమాల‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడ‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.