ఇది విన్నారా.. బాలయ్య 101వ చిత్రం కాపీనట!

Balayya-puri-movieడాషింగ్‌ డైరెక్టర్‌గా పేరున్న పూరి జగన్నాధ్‌ తన తర్వాత సినిమాగా బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్‌ హాలీవుడ్‌ సినిమాల పాత్రలను ఎక్కువగా ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కథలు రాస్తాడనే టాక్‌ ఉంది. పూరి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అయిన ‘పోకిరి’ సినిమా ఒక హాలీవుడ్‌ సినిమాను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని తెరకెక్కించింది. పూరి ఇంకా ఎన్నో చిత్రాలను హాలీవుడ్‌ చిత్రాల నుండి లీడ్‌ను తీసుకున్నదే. ఇక తాజాగా బాలయ్య 101వ సినిమాను కూడా ఒక హాలీవుడ్‌ సినిమాకు ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కథను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితం వచ్చిన ‘జాన్‌విక్కీ’ అనే చిత్రంలోని హీరో పాత్రను పోలీ బాలయ్య పాత్ర ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అయిన జాన్‌విక్కీలో హీరో రైతుగా కనిపిస్తాడు. అదే తరహాలో బాలయ్య కూడా కనిపిస్తాడని పూరి జగన్నాధ్‌ సన్నిహితులు చెబుతున్నారు. చాలా కాలం క్రితమే ఈ స్టోరీని బాలయ్య కోసమని పూరి రెడీ చేసుకున్నాడట. ఆ రైతు పాత్ర బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో పూరి దీనికి బాలయ్యను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఒక్క హీరో పాత్రను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని మిగిలిన పూర్తి కథను మార్చనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య సరసన బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను ఎంపిక చేయాలని పూరి భావిస్తున్నాడు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే పూరి ప్రకటించాడు. లెక్కలేనన్ని డైలాగ్స్‌ ఈ చిత్రంలో బాలయ్యతో చెప్పిస్తానని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కాని, బాలయ్య 101 కాపీ సినిమా అంటూ ప్రచారం జరుగుతుండటం నందమూరి ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగా ఉంది. సినిమా సక్సెస్‌ అయితే ఇవన్ని ఏ ఒక్కరు పట్టించుకోరు అని ఫ్యాన్స్‌ సర్ది చెప్పుకుంటున్నారు.