‘బలగం’ మొగిలయ్యకి తీవ్ర అస్వస్థత !


టాలీవుడ్లో రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా బలగం. కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ మూవీ.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. హెవీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక సినిమా చివరిలో వచ్చే పాటకి ప్రేక్షకుల హృదయాలు భాదతో బరువెక్కాయి. ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే… ఆపాటని ఎంతో హృద్యంగా పాడి కోట్లాది మంది మనసులను గెలుచుకున్న గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గత కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. గత వారం రోజులుగా ఆయన వరంగల్ సంరక్ష హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా రావడంతో మొగిలయ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

దీనికితోడు.. మొగిలియ్య కుటుంబ పరిస్థితి, ఆర్ధిక పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో తన భర్తను ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ కోరుతోంది. గత ఏడాది కాలంగా మొగిలయ్యకి బీపీ, షుగర్ సమస్యలు ఉండటంతో తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆయన వారానికి మూడు సార్లు వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించడంతో డయాలసిస్ చేయడానికి మొగిలయ్య శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. బలగం సినిమా వల్ల వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంచి గుర్తింపు వచ్చింది. బుర్ర కథలు చెబుతూ జీవించే మొగిలయ్య ఆరోగ్యం విషమించడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఆయన్ని ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు.