తెలుగులో సెన్షేషనల్ సక్సెస్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. హిందీలో 300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న కబీర్ సింగ్ ఈ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది. రికార్డుల మోత మ్రోగించిన కబీర్ సింగ్‌తో మన తెలుగు సినిమా సత్తా అక్కడ తెలిసింది. ఇక తమిళంలో అర్జున్ రెడ్డిని ఆధిత్య వర్మగా రీమేక్ చేశారు. తెలుగులో అర్జున్ రెడ్డికి సహ దర్శకుడిగా ఉన్న గిరీశయ్య ఈ చిత్రంకు దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఆధిత్య వర్మను విడుదల చేయడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం జులై మద్యలోనే విడుదల చేయాల్సి ఉంది. కాని కబీర్ సింగ్ చిత్రం ఒకవైపు ఆడుతున్న సమయంలో ఆధిత్యవర్మను తీసుకు వస్తే ఏమాత్రం సరిగా ఉండదని, కబీర్ సింగ్ సందడి తగ్గిన తర్వాత తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కబీర్ సింగ్ చిత్రం జోరు మెల్ల మెల్లగా తగ్గింది. 50 రోజులు పూర్తి చేసుకున్న కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద నుండి పూర్తిగా తప్పుకున్నాడు. దాంతో మరో నెల రోజుల్లో ఆధిత్య వర్మను తీసుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.