వెలుగులోకి వస్తున్న “బొంబాయి” అందగాడు

arvind-swamy-kadal‘రోజా’, ‘బొంబాయి’ సినిమాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించిన అందగాడు అరవింద్‌ స్వామి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’ చిత్రం లో రజనీకాంత్ తమ్మునిగా నటించడం ద్వారా పరిచయమైన అరవింద్‌ స్వామి అతి స్వల్ప కాలంలోనే యువతరం ఆరాధ్య నటునిగా మారాడు. తెలుగులో నేరుగా నగ్మా సరసన ‘మౌనం’ అనే సినిమాలోనూ నటించాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా సినీ కెరీర్‌కు వదిలేసి, సాఫ్ట్‌ వేర్ రంగంలోకి వెళ్లిపోయాడు. ఉన్నట్టుండి ఈ అందగాడు అజ్ణాతంలోకి వెళ్ళిపోయాడు. అందునా సినిమాల్లో హవా కొనసాగుతున్న తరుణంలోనే సడన్‌ గా కనిపించడం మానివేశాడు. ఇటీవలి కాలంలో మళ్ళీ తన జీవిత భాగస్వామితో విడాకుల కేసు అంటూ మళ్ళీ వార్తల్లోకొచ్చాడు అరవింద్‌ స్వామి. మణిరత్నం సినిమా ‘కడలి’తో చాలా కాలం విరామంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమా ‘కడల్’లో ఓ కీలక పాత్ర చేశాడు. “సీతాకోకచిలుక”, “అభినందన”, “ఘర్షణ” వంటి చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితుడైన నిన్నటి తరం హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ హీరోగా, అలనాటి అందాల తార రాధ చిన్న కుమార్తె తులసి హీరోయిన్‌గా ఈ సినిమాలో పరిచయమవుతున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘కడలి’కి వనమాలి పాటలు రాశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో 2013 జనవరిలో ఈ చిత్రం విడుదలవుతోంది.