టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ చిత్ర విడుదల సమయం దగ్గరపడుతున్న కూడా ‘బాహుబలి’ ఫీవర్ బాగా పెరిగిపోతుంది. హాట్ కేకుల్లా ఇప్పటికే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. ఇక అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని గంటలను లెక్కపెట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. చిత్ర యూనిట్ అంతా కూడా బిజీ బిజీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ‘బాహుబలి 2’ చిత్ర యూనిట్ దేవసేన లుక్‌ను విడుదల చేశారు. నీలి రంగు చీరతో ఒంటి నిండా ఆభరణాలను వేసుకుని ఉన్న అనుష్కను చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు. దేవసేన ముఖంలో రాజసం అలా ఉట్టిపడుతుంది. మొదటి పార్టులో ఈ అమ్మడు కేవలం ఒకే చీరలో దారుణంగా కనిపించింది. కానీ ఈ చిత్రంలో అనుష్క చాలా రాజసంగా, యువరాణి, మహారాణిలాగా కనిపించనుందని ఈ స్టిల్ చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి దేవసేనను చూస్తుంటే కన్నుల పండుగలాగా అనిపించి ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది అని ప్రేక్షకుల మనస్సు తహతహలాడుతుంది. ఈ చిత్రం ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.