ఈత‌రంలో పుట్టనంద‌కు బాధ లేదు.. సంతోషంగా ఉంది!!

anrఈత‌రంలో పుట్టనంద‌కు బాధ లేదు.. సంతోషంగా ఉంది!!
– తెలుగు మిర్చీతో అక్కినేని నాగేశ్వర‌రావు

అక్కినేని.. మూడు త‌రాల వార‌ధి. తెలుగు సినిమాకు పెద్దన్నయ్య‌. ఎందుకంటే పరిశ్రమ వ‌య‌సు 83 అయితే, ఆయ‌న‌ది 90. ఇప్పటికీ హుషారుగా, ఏ పాత్ర వ‌చ్చినా చేయ‌గ‌ల‌ను అనేంత ధీమాగా ఉన్నారంటే – అది ఆయ‌న అల‌వ‌ర్చుకొన్న క్రమ‌శిక్షణ‌, పాటించిన ఆరోగ్య సూత్రాల వ‌ల్లే. ఎన్నో అద్భుత‌మైన పాత్రలు ఆయ‌న కోస‌మే పుట్టాయ‌నిపిస్తోంది. దేవదాసు, విప్రనారాయ‌ణ‌, బాట‌సారి.. ఇలా ఒక‌టా, రెండా..? తెలుగు చిత్రసీమ‌ స్వర్ణకాంతులు విర‌బూసిన సినిమాల్లో ఆయ‌న వాటా కూడా అధికంగానే ఉంది. ఇప్పుడు మ‌నం సినిమాతో ముస్తాబ‌వుతున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వర‌రావు జ‌న్మదినం. ఈ సంద‌ర్భంగా తెలుగు మిర్చీ ప్రత్యేకంగా సంభాషించింది.

* పుట్టిన రోజు శుభాకాంక్షలు…
– థ్యాంక్యూ..

* మ‌నం లో మ‌రీ బుజ్జాయిలా ఉన్నారు..
– త‌మ‌షాగా ఉంది క‌దూ.. ఆ ఫొటో షూట్ జ‌రుగుతున్నప్పుడు కూడా నేను బాగా ఎంజాయ్ చేశా. మంచి థాట్‌. ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి అదో మ‌చ్చుతున‌క‌.

* మూడు త‌రాలు ఒకే సినిమాలో చూడ‌గ‌లుగుతున్నాం. తెలుగు ప్రేక్షకుల‌కు ఇంత కంటే అదృష్టం ఏముంటుంది?
– ఇదో అద్భుత సంఘ‌ట‌న‌. అభిమానులు చాలా సంతోష‌ప‌డ‌తారు. ఎందుకంటే తాత‌లూ, నాయ‌న‌మ్మలంతా నా ఫ్యాన్స్‌. అమ్మలూ, నాన్నలంతా నాగార్జున‌ను ఇష్టప‌డ‌తారు. ఇక ఈత‌రంలో చైతూకి అభిమానులున్నారు. మూడు త‌రాల ప్రేక్షకుల‌కూ బాగా న‌చ్చేసినిమా అవుతుంది.

* తొలిసారి ముగ్గురూ క‌ల‌సి కెమెరా ముందుకొచ్చిన సంద‌ర్భం గుర్తుందా?
– ఉంది, లేకేం…? అయితే అదో ప్రత్యేక క్షణం అని అప్పుడు అనిపించ‌లేదు. నా దృష్టంతా నా పాత్రపైనే. ఎప్పట్లానే ప్రొఫెష‌న‌ల్ గానే ఆలోచించా. వాళ్లిద్దరూ నా స‌హ న‌టులు అంతే.

* 90 యేళ్లొచ్చినా మేక‌ప్ వేసుకోగ‌లుగుతున్నారు… ఏమిటా ర‌హ‌స్యం?
– సినిమాపై ఆస‌క్తి. నాలో న‌టించే ఓపిక ఇంకా ఉంది. అంతే..

* ఫ‌లానా పాత్ర చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా?
– నా అదృష్టం వ‌ల్ల అన్ని పాత్ర‌లూ చేశా. జీవితంలో వెలితి ఏమీ లేదు. నా దృష్టి ఎప్పుడూ… ఇచ్చిన పాత్రకు న్యాయం చేయాల‌నే ఉండేది. ఆ పాత్ర ఎందుకు ద‌క్క‌లేదు?? అనే ఆలోచ‌న ఉండేది కాదు.

* ప్రతినాయ‌కుడి పాత్ర ఎప్పుడూ చేయ‌లేదు క‌దా?
– అవును. నేను రౌడీ పాత్ర‌ల‌కు ఏం ప‌నికొస్తా. శ‌కునిలా… పాచిక‌లు వేసే పాత్రలైతే ఓకే. ఇప్పటికీ నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వ‌స్తే.. చేయ‌డానికి సిద్ధమే.

* ఈత‌రంలో పుట్టుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?
– ఏమాత్రం లేదు. ఈత‌రం ఎంతో వృద్దిలోకి వెళ్తోంది అనుకొంటే క‌దా, ఈర్ష్య ప‌డ‌డానికి. స్వర్ణయుగం రోజుల నుంచి వ‌చ్చా. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు పుట్టనందుకే ఎక్కువ సంతోషిస్తున్నా. పార్టీలూ, ప‌బ్‌లూ, మందు కొట్టడాలూ ఇవి త‌ప్ప‌, ఏముంది??

* 90లో ఇంత జోరు చూపిస్తున్నారు, ఆరోగ్య ర‌హ‌స్యం ఏమిటి?
– త‌క్కువ‌గా తిను, ఎక్కువ రోజులు జీవించు అనేదే ఆ ఆరోగ్య సూత్రం. వ‌యసులో ఉన్నప్పుడూ మితంగానే తినేవాడిని. ఇప్పుడూ అంతే.