Site icon TeluguMirchi.com

‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది.. విజయ్ దేవరకొండ


ఇటీవలి కాలంలో చిన్న సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. కథ బాగుంటే చాలు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అలాంటి అంచనాలతో రాబోతుంది అన్నపూర్ణ ఫొటో స్టూడియో. చెందు ముద్దు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్​, ప్రోమోలు, పాటలతో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. కాగా జూలై 21న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. “నేడే చూడండి మీ అభిమాన థియేటర్​లో అన్నపూర్ణ ఫొటో స్టూడియో. మనస్సుకు హత్తుకునే ప్రేమ కథ, గిలిగింతలు పెట్టే హాస్యం, ఉర్రూతలెక్కించే అందమైన పాటలు, ఉత్కంఠ భరితంగా సాగే కథనం, పోరాటలు, ఉహకందని మలుపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ఉన్నాయి” అంటూ ప్రచార చిత్రంలో అన్ని సన్నివేశాలను చాలా బాగా చూపించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని నటీనటులు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇకపోతే ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చింది. టీజర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 21న ఈ సినిమా థియేటర్లో వస్తోంది. అందరూ తప్పక చూడండి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. బిగ్ బెన్ స్టూడియోస్‌ నా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. బిగ్ బెన్ స్టూడియోస్ వల్లే పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది. యశ్ మామకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Exit mobile version