Site icon TeluguMirchi.com

పది సంవత్సరాల అల్లు వారబ్బాయి !

allu-arjunప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సుపరిచితమై ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెరంగ్రేటం చేశాడు. తన వెనక సినీ కుటుంబం ఉన్నా, ఏనాడు హీరో అవ్వాలని అతను కలలు కనలేదు. మనసంతా.. కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ బొమ్మలపైనే ఉండేది. అయితే పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు బన్నీని చిత్ర రంగంవైపు అడుగులు వేయించాయి. బన్నీలో ఉండే చలాకీతనం, చురుకుతనం, చిన్నప్పటినుంచీ.. చిరు పాటలకు స్టెప్పులేస్తూ.. అందరినీ ఆకర్షించాడు. డాడీ సినిమాలో వేసిన స్టెప్పులతో తనది స్ప్రింగ్ బాడీ అని, యాక్టింగ్ లో ఏంత ఈజ్ ఉందో చెప్పకనే.. చెప్పేశాడు. ఇక అంతే.. చిరు మేనల్లుడి తెరంగేట్రానికి ఏర్పాట్లు జరిగాయి. ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. అయితే.. తన పెద్దల నుంచి ఏకలవ్య శిష్యుడిగా నాటి నుంచి నేటి వరకు.. నేర్చుకుంటూనే ఉన్నాడు. అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగింది. శతాధిక దర్శకుడు రాఘవేంద్ర రావు.. బన్నీ తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడికి గంగోత్రి వందో సినిమా కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అశ్వినీదత్ తో కలసి అల్లు అరవింద్ నిర్మించారు.

గంగోత్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా, స్టైలిష్ స్టార్ ఇమేజ్ తెచ్చిన చిత్రం మాత్రం ఆర్య. ఈ చిత్రం కోసం తన లుక్స్, గెటప్స్ పూర్తిగా మార్చేశాడు. ఫీల్ మై లవ్ అంటూ.. తెర ముందు తెర వెనక అందరి ప్రేమను పొందాడు. ఈ సినిమాతో.. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో విజయాన్ని సాధించడంతో బన్నీ వెన్నక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆర్య వంటి సూపర్ హిట్ స్టైలిష్ సినిమా చేసినా బన్నీ మాత్రం మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరుసగా హ్యాపి, దేశముదురు, ఆర్య2, వేదం, బద్రినాథ్, జులాయి వంటి సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్న అల్లు అర్జున్ మార్చి 28 నాటికి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి పది వసంతాలు పూర్తి చేసుకున్నందున తన నిర్మాతలు, తోటి నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు శుభాభినందనలు తెలిపారు.

బన్నీ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ రూపొందిస్తున్న ఇద్దరమ్మాయిలతో.. సినిమా షూటింగ్ కోసం స్పైయిన్ లో ఉన్నారు. టైటిల్ కి తగ్గ రీతిలోనే వినూత్నంగా ఈ చిత్రం వుండబోతుంది. ఇప్పటికే బన్నీ లుక్ కి పలువురు సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుండి సామాన్య ప్రేక్షకుల దాకా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ లో విడుదల చేసి, చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version