మెగా ఫాన్స్ కి పండగే… చిరు సినిమాలో అకీరా ?


మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది హీరోలుగా టాలీవుడ్‌కి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. అకీరాకు సినిమాల కన్నా సంగీతం అంటే ఎక్కువ ఇష్టమని, తన తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. అకీరా తన భవిష్యత్తు గురించి నిర్ణయం స్వయంగా తీసుకోవాలన్న దృష్టితోనే ముందుకు వెళ్తున్నారని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను హీరోగా వెండితెరపై చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ కోరిక త్వరలోనే నెరవేరనుందనే వార్తలు సోషల్ మీడియా ద్వారా హల్‌చల్ చేస్తున్నాయి. అకీరా నందన్ త్వరలోనే తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఇప్పటికే సినిమా 80% వరకు టాకీ పార్ట్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ కూడా ముగియనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పలు భాషల ప్రముఖ తారలు నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే అకీరా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.