పీజే శర్మ మనవడు, సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ నటుడిగా పన్నెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆది తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు. ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నేటికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ పుష్కర కాలంలో ఆది ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన కెరీర్‌లో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఇకపోతే గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చారు. కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో, బ్లాక్, అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు ఆది. ఇక సాయికుమార్ కొడుకే అయినప్పటికీ తండ్రి ప్రభావం తన మీద పడకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్నాడు ఆది.