Operation Valentine : వాఘా బోర్డర్ లో వరుణ్ తేజ్ ‘వందేమాతరం’ లాంచ్..


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ ను ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసారు మేకర్స్.

దీంతో ‘వందేమాతరం’ అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసిన మొట్టమొదటి పాటగా చరిత్ర సృష్టించింది. ఇక టైటిల్ సూచించినట్లుగా ‘వందేమాతరం’ దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతం. వైమానిక దళ సైన్యం పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు చూపే ఈ పాట తమ దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి. ఈ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేస్తున్న వరుణ్ తేజ్ ఈ పాటలో యూనిఫాంలో ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు. తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్ యుద్ధంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ (వరుణ్ తేజ్) గురించి ఆందోళన చెందే రాడార్ ఆఫీసర్‌గా కనిపించింది.

సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శక్తివంతమైన పదాలతో గొప్ప ఉత్తేజం, ఉత్సాహం నింపింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ పాటను తెలుగు లో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ చక్కగా పాడారు. ఇక ఈ చిత్రం తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16 న విడుదల కానుంది.