Site icon TeluguMirchi.com

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రానికి అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదలైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్.. ఇష్టమైన వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని మనసు విప్పి మాట్లాడినట్లుగా, వర్షాకాలంలో ఆరుబయట కూర్చొని మిర్చి బజ్జీలు తింటూ అమ్మతో కబుర్లు చెప్పినంత హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. సహజమైన, సున్నితమైన ప్రేమకథలను తీసుకొని వాటిని సరదాగా, మనసుకి హత్తుకునేలా తెరకెక్కించడం దర్శకుడు శ్రీనివాస్ అవసరాల శైలి. ఈ చిత్రంతో ఈసారి అంతకుమించిన మ్యాజిక్ చేయబోతున్నారని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. “ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో” అంటూ టీజర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. “పాత్రకు అవసరమైతే ఎక్స్ పోజింగ్ కూడా చేస్తా” అని కథానాయకుడు అనడం, “పెళ్ళైన తర్వాత కూడా నటిస్తా” అని కథానాయిక చెప్పడం చూస్తుంటే.. నటీనటుల మధ్య ఓ అందమైన ప్రేమ కథ చూడబోతున్నామని అర్థమవుతోంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్.. మరోసారి అద్భుతం చేయబోతున్నట్లు టీజర్ తోనే తెలియజేశారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

టీజర్ విడుదల సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ.. “2013 లో అవసరాల గారిని కలిశాను. ఆయనకిది మూడో సినిమా. ఆయనతో నాకిది మూడో సినిమా. కానీ నాకు మాత్రం ఇది 23వ సినిమా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారానే నేను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యాను. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ఎలాగైతే గుర్తుండిపోతాయో.. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకముంది. ఈ సినిమాని ఆయన తీసినట్లు ఎవరూ తీయలేరు. కొన్ని సినిమాలు విడుదలై విజయం సాధించాక మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల కాకముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. మాళవిక నాకు మంచి ఫ్రెండ్. తను చాలా మంచి యాక్టర్. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

మాళవిక మాట్లాడుతూ.. “టైటిల్ ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అయ్యుండొచ్చు. కానీ ఈ సంజయ్, అనుపమల ప్రేమకథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. ఎందుకంటే ఇది శ్రీనివాస్ గారి మ్యాజిక్. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “ఇది టీమ్ అంతా కలిసి చర్చించుకొని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సినిమాటిక్ డైలాగ్స్ తో స్క్రిప్ట్ ని రాయకుండా.. నిజ జీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం కలిసి ఒక టీమ్ లా పనిచేశాం” అన్నారు.

Exit mobile version