పైలట్లకు ‘నిత్య’ కష్టాలు !

Nithya-Menonప్రముఖ సినీనటి నిత్యామీనన్ వల్ల పైలట్లు కోరి మరీ నిత్య కష్టాలు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. నిత్య వల్ల ఇద్దరూ పైలట్లు సస్పెన్షన్ కు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అసలు విషయమేమిటంటే.. గత నెలలో బెంగళూరు నుంచి హైదరాబాదుకు ఎయిర్ ఇండియా విమానంలో నిత్యా మీనన్ ప్రయాణించింది. అయితే, ఈ జర్నీ లో నిత్యానే మనసుపడిందో.. లేదా అందాల తార అని పైలెట్లే (జగన్ ఎం. రెడ్ది, ఎన్.కిరణ్ లు) ఆహ్వానించారో గానీ.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆమె తన సీట్లోంచి లేచి కాక్‌ పీట్ లోకి వెళ్లింది. దాదాపు కాక్ పీట్ లో నిత్య 45 నిమిషాల పాటు ఉన్నట్లు సమాచారం. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, హైదరాబాద్ కు ప్లైట్ చేరుకోగానే అందులోని ఓ ప్రయాణికుడు.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో.. కథ కంచికెక్కినట్లయింది.

నిబంధనల ప్రకారం ఆ స్థానంలో డీజీసీఏ గుర్తింపు పొందిన పరిశీలకులు మాత్రమే కూర్చోవాలి. ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో డీజీసీఏ దర్యాప్తు మొదలు పెట్టింది. దీంతో.. నిత్యను కాక్ పీట్ లోకి ఆహ్వానించిన ఇద్దరు పైలెట్లు జగన్, కిరణ్ లపై సస్పెండ్ వేటు వేసింది. అంతేకాకుండా.. నిత్యా మీనన్ కేవలం కాక్ పిట్లోకి వెళ్లి అక్కడి పరికరాలను చూసేవరకే పరిమితమయ్యిందా లేదంటే విమానాన్ని నడిపిందా అనే కోణంలో డీజీసీఏ దర్యాప్తు చేస్తోందని సమాచారం.