తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా ప్రధానపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ‘అమ్మ’ పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్ కథను మలుపుతిప్పే ఘట్టంగా తెలుస్తోంది.
‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..జయ’ అంటూ కంగనా చెబుతున్న డైలాగ్ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో చెప్పకనే చెబుతోంది.
జయలలిత అంటే.. ఓ పేరు కాదు. ఓ వ్యక్తి కాదు. ఓ తరం. ఓ ఆవేశం. ఓ ఉధృతి. ఓ ఉప్పెన. ఓ సామాన్య నటి .. ఓ రాష్ట్రానికి అమ్మగా మారిన ప్రయాణం. అనుమానాల్ని, సవాళ్లని, సంక్షోభాల్ని… మెట్లుగా చేసుకుని, సింహాసనాన్ని అధిష్టించిన అద్భుతమైన ప్రయాణం. ఆ కథే.. ఆమె కథే.. ఇప్పుడు `తలైవి`గా రావడం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది.