క్రికెట్ అభిమానులు ఇప్పుడు మొతేరా పిచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐదు రోజులు సాగాల్సిన టెస్ట్ మ్యాచ్.. రెండు రోజులకే ముగిసిపోయింది. ఇంకా చెప్పాలంటే పూర్తి రెండు రోజులు కూడా ఆడలేదు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 112 ఆలౌట్. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ 145 ఆలౌట్. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 81 పరుగులకు ఆలౌట్. భారత్ గెలుపు. నిండా రెండు రోజులైనా ఆట సాగలేదు.
ఇక్కడో హైలెట్ వుంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జోయ్ రూట్.. సూపర్ బౌలర్‌గా మారాడు. సెంచరీలు చేసే జోయ్ రూట్ బౌలింగ్‌లో ఎనిమిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. దీంతో అసలు పిచ్ పైనే బోలెడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా భారీ ఖర్చుతో తీర్చిదిద్ది.. అత్యంత ఆధునిక వసతులతో సిద్ధం చేశారు కానీ.. ఆటకు కావాల్సిన పిచ్‌ను మాత్రం పరమ నాసిరకంగా తయారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. రన్స్ కాదు.. బంతిని సరిగ్గా డిఫెండ్ చేయడానికి కూడా హమ్మయ్యా అనుకోవాల్సిన పరిస్థితిలో బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు.
ఐతే పిచ్ లో ఎలాంటి లోపం లేదని అంటున్నాడు కెప్టన్ విరాట్. టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని చెప్పాడు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదు. అంత మాత్రాన సరిగ్గాలేదని అనడం తప్పు. మేం 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశాం. అలాంటిది 150 కన్నా తక్కువకే ఆలౌటయ్యాం. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్ అవుతోంది. మన డిఫెన్స్‌పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్ త్వరగా ముగిసింది” అని చెప్పుకొచ్చాడు విరాట్. ఇంగ్లాండ్ కెప్టన్ కూడా ఇదే మాట చెప్పాడు. ఆటగాళ్ళ వైఫల్యం తప్పితే పిచ్ వైఫల్యం కాదని తన అభిప్రాయం వెల్లడించాడు. మొత్తానికి మొతేరా పిచ్ క్రికెట్ వరల్డ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.