సినీ పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే థియేటర్లనూ మూసేస్తారని ప్రచారం మొదలైంది. కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ అనే ఆంక్షలైనా తెరపైకి వస్తాయని చెప్పుకుంటున్నారు.
దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. థియేటర్లని మూసేసేలా నిర్ణయమేదీ తీసుకోలేదని, అవన్నీ పుకార్లే అని వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. కనోనా సమయంలో చిత్రసీమ బాగా నష్టపోయిందని, వాళ్ల అవసరాల్ని తెలుసుకుని, సమస్యలు తీర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. కోవిడ్ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని థియేటర్లను నడుపుకోవొచ్చని సూచించారు. మంత్రి ప్రకటన తో చిత్రసీమ ఊపిరి పీల్చుకున్నట్టైంది.