ఆ విషయంలో రాజమౌళి మాట తప్పాడా!

‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం కోసం దాదాపు అయిదేళ్లు తిండి, నిద్ర, సంతోషం లేకుండా ఒత్తిడిని అనుభవించాడట. విడుదలయిన తర్వాత ఫలితాన్ని చూసి ఊపిరి పీల్చుకుని ఆ తర్వాత ఓ మూడు నెలల సినిమాల గురించి ఆలోచించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతా అంటూ చెప్పుకొచ్చాడు. కానీ రాజమౌళి ఫ్యామిలితో కలిసి భూటాన్‌ వెళ్లి తిరిగొచ్చి మళ్లీ సినిమాల మీదనే పడ్డట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళితో చేయడానికి స్టార్‌ హీరోలు, నిర్మాతలు తెగ ఆరాటపడుతున్నారు. అందుకే ఆ పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

రాజమౌళి తదుపరి చిత్రంలో హీరోగా ఎన్టీఆర్‌ ఫిక్సయ్యాడు అని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా సూపర్‌స్టార్‌ మహేష్‌కు కూడా కమిట్మెంట్‌ ఇచ్చాడని, మహేష్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్‌ నారాయణ నిర్మించనున్నారట. అందుకే రాజమౌళి విరామం తీసుకుని తన బృందంతో కలిసి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో తదుపరి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని చర్చలు జరుపుతున్నారట. అందుకే విజయేంద్ర ప్రసాద్‌ గతంలో చేసిన రచనలను కూడా పరిశీలిస్తున్నారట. ఇలా హీరోల ప్రెజర్‌ వల్ల రాజమౌళి మూడు నెలలు సినిమాలకు దూరంగా ఉంటా అన్న మాటను తప్పాడు.