మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ప్రస్తుతం సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. బింబిసార సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా, హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలతో కూడిన విభిన్న కథనంతో రూపొందుతోంది. సినిమా కథనంలోని దాదాపు 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉండగా, హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా 13 గ్రాండ్ సెట్స్ నిర్మించారు.
ఇటీవల హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ‘రామ… రామ…’ అనే తొలి సింగిల్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిమయ గీతాన్ని రూపొందించేందుకు మేకర్స్ ఏకంగా రూ.6 కోట్లు వెచ్చించారంటే పాట ఎంత గ్రాండ్‌గా తీర్చిదిద్దారో అర్థం అవుతుంది. నాలుగు భారీ సెట్స్‌లో, 12 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించగా, దానికి 400 మంది డ్యాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులు భాగస్వామ్యం అయ్యారు. పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, శంకర్ మహదేవన్, లిప్సిక తమ గాత్రాలతో పాటకు ప్రాణం పోసారు. శోభి మాస్టర్, లలిత శోభి కొరియోగ్రఫీ పట్ల తీసుకున్న శ్రద్ధ పాటను ఒక విజువల్ ఫీస్ట్‌గా మార్చింది.
చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ (2006) సినిమాలో కలిసి కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘విశ్వంభర’తో జంటగా తెరపైకి రాబోతున్నారు. అషికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, జులై 24, 2025న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యం, అద్భుతమైన విజువల్స్, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘విశ్వంభర’ ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచేలా కనిపిస్తోంది.