సినీనటి విజయశాంతి, ఇటీవల విడుదలైన ‘అర్జున్ S/o వైజయంతి’ విజయోత్సవ వేడుకలో, సినిమాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొంతమంది కావాలనే సినిమాలను బలవంతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. “బాగున్న సినిమాను బాగా లేదని, బాగలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏమిటి?”, అంటూ ఆమె ప్రశ్నించారు. సినిమా నచ్చకపోతే చూడకుండా ఉండొచ్చుకానీ, దాన్ని నాశనం చేయాలని ప్రయత్నించటం అసహ్యకరం అని వ్యాఖ్యానించారు. కోట్లు ఖర్చుపెట్టి ఎంతో శ్రమతో తీసే సినిమాలను ఎవరూ తక్కువచేయకూడదని, ప్రతి ఒక్క సినిమా విజయవంతం కావాలన్నదే తన కోరిక అని చెప్పారు.
“చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తాయి”, అని చెప్పిన విజయశాంతి, తప్పుడు ప్రచారాలతో సినిమాలను చంపడమంటే అందులో పాల్గొన్న ఎంతో మంది కళాకారుల, సాంకేతిక నిపుణుల జీవితాలను ప్రమాదంలో నెట్టడం అని అన్నారు. థియేటర్లలో ప్రజలు సినిమా చూసి ప్రశంసిస్తుండగా, సోషల్ మీడియాలో కొందరు పైశాచిక ఆనందంతో తప్పుడు అభిప్రాయాలు పంచుకోవడం బాధాకరమన్నారు. “సినిమాలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మంచి ప్రయత్నాలను ప్రోత్సహించండి” అంటూ ఆమె చివర్లో సందేశం ఇచ్చారు.