పసిబిడ్డను పొట్టనపెట్టుకున్న తండ్రి

కన్నబిడ్డలను కంటికి రెప్పల్లా చూసుకోవాల్సిన తండ్రి…పసిబిడ్డలని కూడా చూడకుండా ఐస్‌క్రీమ్‌లో ఎలుకల మందు పెట్టి చంపిన ఘటన ముంబై సమీపంలోని మంఖుర్ద్‌ ప్రాంతంలో జరిగింది. మంఖుర్ద్‌ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అలీ నౌషద్‌కు అర్మాన్ (రెండేళ్లు), అలీషాన్ మొహమ్మద్ (ఐదేళ్లు), అలీనా (ఏడేళ్లు) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కొన్నాళ్లుగా నౌషద్‌కు, అతడి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న కలహాలతో అతడు తన బిడ్డలను చంపేయాలనుకున్నాడు. గురువారం తన పిల్లలకు ఐస్‌క్రీమ్స్‌ తెచ్చి, వాటిలో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత చూసిన నౌషద్ భార్య తన పిల్లలను ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అలీషాన్ మొహమ్మద్ (5) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నౌషద్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అతడిని అరెస్ట్ చేశారు.