అమరావతి మరో “మెగా” స్వర్గం కాబోతుంది…ఎలా ?

Amaravathi-megaprojectకొత్త రాజధాని అమరావతికి సమీపంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు సమీపంలోని ముక్త్యాల గ్రామం దగ్గర 310 ఎకరాలలో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్‌షిప్ అమరావతికి ప్రత్యేక ఆకర్షణ కానున్నది. దీనికి సంబంధించి రూ.218 కోట్ల వ్యయంతో 48.57 ఎకరాలలో నదీ అభిముఖంగా నెలకొల్పుతున్న ‘ఇంటిగ్రేటెడ్ మెగా టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ ఏర్పాటుపై గురువారం ఉదయం ఏపీ పర్యాటక శాఖతో జీఅండ్‌సీ గ్లోబల్ కన్సోర్టియమ్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ‘టూరిజం డెస్టినేషన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’గా కృష్ణా, పాలేరు నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటవుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో ‘తెలుగు వైభవం’ పేరిట ఆంధ్ర సంస్కృతికి అద్దం పట్టే హస్తకళల గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ రాజస్థాని డోలారీధని తరహాలో తెలుగు సంప్రదాయ వంటకాలతో కూడిన ఫుడ్-ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులను ఏర్పాటుచేస్తారు. చెంతనే వున్న ట్యాంక్ బండ్‌పై తెలుగు వైభవ మూర్తుల విగ్రహాలను నెలకొల్పి దాన్ని ప్రసిద్ధ విహారస్థలిగా రూపొందిస్తారు.

యువజనుల కోసం ఫిష్ డెక్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, గోల్ఫ్ కోర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్, అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్, సీనియర్ సిటిజెన్స్ కోసం ఆశ్రమం, బొటానికల్ గార్డెన్స్, స్టార్ హోటల్, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా కన్వెన్షన్ సెంటర్, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హైదరాబాద్ నుంచి ముక్త్యాలకు జాతీయరహదారి మార్గంలో రెండు గంటల సమయం పడుతుందని, ఇక్కడి నుంచి జల రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా అమరావతికి 45 నిమిషాల్లో చేరుకునే వీలుందని జీఅండ్‌సీ గ్లోబల్ కన్సోర్టియం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏవీఆర్ చౌదరి చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

ఇలావుంటే, కృష్ణా పుష్కరాల కోసం జీఅండ్‌సీ సంస్థ ముక్త్యాల కృష్ణానది దగ్గర ప్రత్యేకంగా ఘాట్‌ను అభివృద్ధి చేసింది. లక్షమంది రోజూ పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఘాట్ దగ్గర టాయిలెట్స్, ఇతర సదుపాయాలు కల్పించారు. 70 ఎకరాల స్థలంలో 7 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయమే బయల్డేరి మధ్యాహ్నం తిరిగి వెళ్లిపోయేందుకు వీలుగా ఈ ఘాట్ సౌకర్యంగా వుంటుందని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు జీఅండ్‌సీ ప్రతినిధులు చెప్పారు.