జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

03brk176a
ఎట్టకేలకు జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) సవరణ బిల్లు కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ కి యావత్‌ సభ మద్దతు తెలిపింది. మూడు కీలక సవరణలతో ఈ చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు ఉన్నారు. సభలో ఉన్న ఏ సభ్యుడు కూడా జీఎస్ టీ బిల్లుని వ్యతిరేకించకపోవడం విశేషం. జీఎస్‌టీ చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశమంతా ఒకటే పన్ను వర్తించనుంది. కాగా, జీఎస్‌టీ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం వుండటంతో ఓటింగ్‌కు దూరంగా వుండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

తాజా పరిణామంతో వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, మన్నికైన వినియోగదారు వస్తువులు, లాజిస్టిక్స్‌, డీటీహెచ్‌ తదితర రంగాలకు సానుకూల వాతావరణం కనిపించగలదన్న అంచనాలున్నాయి. జీఎస్‌టీ ప్రభావం ఏ రంగంపై ఎలా ఉండొచ్చంటే..
వాహన రంగం : జీఎస్‌టీ అమలుతో పన్నుల రేటు 20-22 శాతానికి తగ్గే అవకాశం ఉంది. రవాణా సమయం, సరకుపై మొత్తం ఖర్చు తగ్గుతుంది. సరకు రవాణా వ్యయం, సరఫరా వ్యవస్థ ఖర్చులు దాదాపు 30-40% దిగిరావొచ్చు.

బ్యాంకింగ్‌ : జీఎస్‌టీ ద్వారా ఫీజులు విధించే లావాదేవీలపై పన్నుల రేటు 18-20 శాతానికి పెరగొచ్చు. పన్నులు పెరగడం వల్ల నిర్వహణ వ్యయాలు సైతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. రుణ ప్రాసెసింగ్‌ ఛార్జీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఛార్జీలు, బీమా ప్రీమియంలు వంటి ఆర్థిక సేవల ఖర్చు పెరగొచ్చు.

ఔషధ : ఔషధ రంగంపై జీఎస్‌టీ ప్రభావం తటస్థంగా ఉండొచ్చు. పలు కంపెనీలపై పడుతున్న పన్ను రేటు (ఎక్సైజ్‌ సుంకం) చట్టబద్ధ పన్ను రేటు (6%) కంటే తక్కువగా ఉంది. ఈ రంగానికి రాయితీ పన్ను రేట్లు కొనసాగే అవకాశం ఉంది.

ఐటీ, ఐటీఈఎస్‌ : ఐటీ రంగంపై జీఎస్‌టీ ప్రభావం తటస్థం నుంచి స్వల్ప ప్రతికూలంగా ఉండొచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంపై పన్నుల రేటు 14 శాతంగా ఉంది. జీఎస్‌టీ అమలుతో పన్నుల రేటు 18-20 శాతానికి పెరిగే అవకాశం ఉంది. మన్నికైన వినిమయ వస్తువులు : జీఎస్‌టీ ప్రభావం ఈ రంగంపై తటస్థం లేదా ప్రతికూలంగా ఉండొచ్చు. జీఎస్‌టీ అమలు ద్వారా గతంలో పన్ను మినహాయింపులు పొందని కంపెనీలకు లబ్ధి చేకూరొచ్చు.

సరకు రవాణా : జీఎస్‌టీ అమలుతో రవాణా సమయం తగ్గుతుంది. తర్వాత వాహన వినియోగం పెరగనుంది. భారీ సామర్ధ్యం కలిగిన వాహనాలకు డిమాండ్‌ పెరిగి.. మొత్తంగా రవాణా వ్యయాలు తగ్గుతాయి. రెండు రాష్ట్రాల మధ్య సరకు రవాణా సులభతరమై.. సరకు రవాణా సేవలకు డిమాండ్‌ పెరగొచ్చు.

టెలికాం : ప్రస్తుతం టెలికాం సేవలపై సేవా పన్ను 14 శాతంగా ఉంది. జీఎస్‌టీ అమలుతో పన్ను రేటు 18 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

మీడియా : ప్రసార సంస్థలపై అధిక పన్ను భారం పడనుంది. ప్రస్తుతం డీటీహెచ్‌ సేవలు అందించే సంస్థలపై పన్నుల రేటు 20-21 శాతంగా (సేవా పన్ను 14 శాతం, వినోద పన్ను దాదాపు 5-7 శాతం కలిపి) ఉంది. ప్రసార సంస్థలపై 14-15 శాతం ఉంది. జీఎస్‌టీ రేటు అయిన 18-20%పన్ను అమలు చేస్తే డీటీహెచ్‌ సేవల అందించే సంస్థలు లబ్ధి పొందగా.. :ప్రసార సంస్థలపై అధిక పన్ను భారం పడనుంది.

వినోదం : ప్రస్తుతం సేవా పన్ను, వినోద పన్ను, వ్యాట్‌లతో కలిపి మల్టీప్లెక్స్‌లపై పన్నుల భారం 22% నుంచి 24% మధ్య ఉంది. జీఎస్‌టీ అమలుతో పన్నుల రేటు 18-20 శాతానికి దిగొచ్చే అవకాశం ఉంది.

జౌళి పరిశ్రమలు : ప్రస్తుతం జౌళి రంగంపై పన్నుల రేటు 6-7 శాతంగా ఉంది. జీఎస్‌టీ అమలుతో తక్కువ పన్నుల రేటు కొనసాగిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పన్ను రేటు అధికంగా ఉంటే మాత్రం కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే కొన్ని ఎగుమతి కంపెనీలకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు చేకూరొచ్చు.

సిమెంట్‌ : జీఎస్‌టీతో సిమెంట్‌ రంగంపై సానుకూల ప్రభావం చూపొచ్చు. ప్రస్తుతం సిమెంట్‌ రంగంపై పన్నుల రేటు 27% నుంచి 32% మధ్య ఉంది. జీఎస్‌టీ అమలుతో పన్నుల రేటు 18-20 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కంపెనీల ఆదాయంలో ప్రస్తుతం 20-25 శాతం ఉన్న రవాణా ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది.