దసరాలోపు చేనేత కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలి

handloom-workers
రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను దసరాలోపు పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం హాజరైన సందర్శకులను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు సీఎంతో తమ సమస్యల గురించి ప్రస్తావించారు. రుణమాఫీ, పెన్షన్లు, ఉచిత కరెంటు, రంగుల ధరలు తదితర సమస్యలను ప్రస్తావించగా ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు.

రాష్ట్రంలో తమ మండలాన్ని విలీనం చేసినప్పటికీ ఇంకా రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేయలేదని ఎటపాక మండలవాసులు ఫణీశ్వరమ్మ నేతృత్వంలో సీఎంను కలిసి అర్జీ సమర్పించారు. ఫెన్షన్లు, ఆధార్ కార్డులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పధకాలను పొందడంలో ఎదుర్కొటున్న ఇబ్బందులను వివరించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీఎస్ఈశీ ఇంజనీర్ అసోసియేషన్ల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలసి తెలంగాణ ప్రభుత్వం నుంచి జీతాలు రాక 1252 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో అందించిన నైతిక మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం తమ జీతాలు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషికి ఏపీజెఎఫ్ సభ్యులు అభినందించారు. ముఖ్యమంత్రిని శాలువాలతో సత్కరించారు. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని 29 గ్రామాలలో వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. బెలూన్స్ ఫెస్టివల్, 5కె రన్, రౌండ్ టేబుల్ కార్యక్రమాలను రోజుకొకటి చొప్పున నిర్వహించేలా ప్రణాళిక రూపొందిచామన్నారు. పెట్టుబడులకు అనుకూల ప్రాంతాలలో రాష్ట్రానికి 2వ ర్యాంకు సాధించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఏడాది పాపకు గుండె సమస్యతో తల్లడిల్లుతున్నానని భవానీపురంకు చెందిన ప్రపూర్ణ భారతి వాపోగా ఉన్నత వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పలువురు సాఫ్ట్‌వేర్ యువకులు ఈ భేటికి హాజరై సీఎం విజన్ గ్రేట్ అంటూ అభినందించారు. ముఖ్యమంత్రి తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొనగా వారిని భుజం తట్టి ఆయా రంగాలలో వారి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

43% ఫిట్‌మెంట్ ఇచ్చిన స్ఫూర్తితోనే తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని ఆర్‌టిసీ కార్మిక సంఘం ప్రతినిధులు కోరారు. సొంత ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొనగా క్రమ దశలలో అన్ని సమస్యలు పరిష్కరిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు.