ఆంధ్రప్రదేశ్ ను సోలార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా చేయాలనేది తన సంకల్పంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం చైనా కంపెనీ జియాన్ లోంగీ సిలికాన్ మెటీరియల్స్ కార్పోరేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సందర్బంగా మాట్లాడారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ లో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్రప్రభుత్వంతో లోంగీ కార్పోరేషన్ ఒప్పందాన్ని చేసుకుంది.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ చైనాలో ఇటీవల తన పర్యటన దరిమిలా ఇంత భారీ పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు లోంగీ కార్పోరేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సిలికాన్ వేఫర్స్ ఉత్పత్తిదారుల్లో , ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందిన లింగో సిలికాన్ మెటీరియల్స్ కార్పోరేషన్ తమ పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసుకోవడం ముదావహంగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కు 2 వ స్థానంలో ఉందంటూ ప్రపంచబ్యాంకు నివేదిక ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత భారీ పెట్టుబడులతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
దీంతో భారతదేశానికే సోలార్ ప్యానల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. దేశంలో సోలార్ ఉపకరణాల తయారీలో ప్రస్తుతం రాష్ట్రం వాటా 10% మాత్రమే ఉందంటూ రాబోయే కాలంలో దీనిని 50%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సుస్థిర ఆర్దికాభివృద్దికి సౌరవిద్యుత్ అనువైన పరిష్కార మార్గంగా పేర్కొన్నారు. రాజధాని నగరం అమరావతిలో కూడా పెట్టుబడులకు విశేషమైన అవకాశాలు ఉన్నాయంటూ పర్యావరణహితంగా రాష్ట్రాన్ని రూపొందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
జియాన్ లోంగీ సిలికాన్ కార్పోరేషన్ ఛైర్మన్ బాషెన్ జాంగ్ మాట్లాడుతూ తమ కంపెనీ ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోలార్ మాడ్యువల్స్ కన్నా అధిక సామర్ద్యమున్న వాటిని ఉత్పత్తి చేయనున్నట్లుగా తెలిపారు. తద్వారా ‘ మేకిన్ ఇండియా’ లో, అదేవిధంగా ‘ఇన్నోవేట్ ఇండియా’లో భాగస్వాములు అవుతున్నట్లుగా చెప్పారు. ఇది తొలిదశ మాత్రమేనంటూ, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని, ఇతర కంపెనీలు తమను అనుసరిస్తాయని తెలియజేశారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ లో రూ.1500 కోట్ల పెట్టుబడితో, 500 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తి చేయనున్నట్లు, 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్లుగా వివరించారు.
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ మేకిన్ ఇండియా పిలుపునిచ్చిన ఏడాది వ్యవధిలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటించిన 6 నెలల్లోనే ఇంతభారీ ఎత్తున పెట్టుబడులు రావడం గొప్ప విషయంగా శ్రీసిటీ సెజ్ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందంపై ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, లోంగీ ఛైర్మన్ బాషెన్ ఝాంగ్ సంతకాలు చేశారు. అనంతరం శ్రీసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు, జియాన్ లోంగీ సిలికాన్ మెటీరియల్స్ కార్పోరేషన్ కు మధ్య మరో ఎంవోయూ జరిగింది.