కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు వేగవంతం కావాలి

cbn-ap-rajadani
ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, అధికారులు, ఉద్యోగుల తరలింపు వేగవంతం కావాలని, అంతా స్మూత్ గా జరగాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సీఆర్ డీఏ అధికారులతో సమీక్షలో ప్రసంగించారు. జవహర్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీదే బాధ్యతగా ముఖ్యమంత్రి అన్నారు. వారికి నివాస వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు.

మేధా టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు, గుంటూరులో అధికారుల నివాసాల వివరాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ప్రతి వారం పురోగతిని తనకు నివేదించాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల యజమానులు అద్దెల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కోరారు.అక్టోబరు 22న రాజధాని శంకుస్థాపన సందర్భంగా నిర్మించే పైలాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండాలని, తెలుగు వైభవానికి చిహ్నంగా పదికాలాలు నిలిచిపోవాలని అన్నారు. పైలాన్ ప్రాంతం పబ్లిక్ పార్కుగా అభివృద్ది చేసే అంశం పరిశీలించాలన్నారు. రివర్ ఫ్రంట్ ను, కాలువల పరిసర ప్రాంతాలను సుందరంగా అభివృద్ది చేయాలన్నారు.

రాజధాని ప్రాంతంలోని గ్రామాలలో యువతలో తమకు శిక్షణ ఇవ్వలేదని, ఉపాధి రాలేదనే భావన రాకూడదని సీఎం చెప్పారు. వారి సామర్ధ్యాన్ని బట్టి, ఆసక్తిని బట్టి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్లేస్ మెంట్లు లభించేలా చూడాలన్నారు. 29 గ్రామాలలో 19,679 మంది అర్హులైన పెన్షనర్లను గుర్తించామని, వారిలో 13,285 మందికి పెన్షన్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.
కన్సల్టెంట్లు నియామకంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలంటూ అవసరమైతే మరో 2వారాలు సమయం తీసుకుని సమర్దులను నియమించాలని సీఎం సూచించారు.

పెదపరిమి,వడ్లమాను,హరిశ్చంద్రపురం గ్రామాలవారు ల్యాండ్ పూలింగ్ లో 8 వేల ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారంటూ దానిని పరిశీలించాలన్నారు. తీసుకున్న భూమిలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయాల్సిన బాధ్యతప్రభుత్వానిదేనంటూ అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలన్నారు.

గన్నవరం విమానాశ్రయం విస్తరణ వేగవంతం కావాలని, భూసేకరణ త్వరితగతిన చేయాలని దిశానిర్ధేశం చేశారు. రన్ వే విస్తరణ, ఫోర్ లైన్ ఇన్నర్ అప్రోచ్ రోడ్ తదితర పనులపై సమీక్షించారు. విజయవాడ-గన్నవరం, విజయవాడ-మచిలీపట్నం రహదారులను 6 లేన్ రహదారులుగా విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం గురించి చర్చించారు.

ఈ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, డా. పి. నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.కే.ఫరీదా, ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, అజయ్ జైన్,శ్రీకాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.