రామ్‌గోపాల్‌వర్మ ‘సైలెంట్‌’

RGVవైలెంట్‌ చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడైన దర్శక సంచలనం రామ్‌గోపాల్‌వర్మ తాజాగా ఓ వినూత్నమైన సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. తన ప్రతి చిత్రంతో ఏదో ఒక కొత్త ప్రయోగానికి, సరికొత్త ఒరవడికి తెర తీస్తుండే రామ్‌గోపాల్‌వర్మ తీస్తున్న చిత్రం పేరు ‘సైలెంట్‌’ కావడం గమనార్హం. ‘సైలెంట్‌’ సినిమాకు సంబంధించిన విశేషాలు ‘ఆర్జీవీ’ మాటల్లోనే…!!

‘‘సినిమా అనేది దృశ్యశబ్ధాల సమ్మేళనం. కానీ, సినిమాల్లో మొదట ‘దృశ్యం’ మాత్రమే ఉండేది. ఆ తరువాత ‘శబ్ధం’ జత కలిసింది.
1903లో విడుదలైన మొట్టమొదటి మూకీ చిత్రం ‘ది గ్రేట్‌ ట్రెయిన్‌ రోబరి’. ఈ చిత్రంతో హాలీవుడ్‌లో స్టార్ట్‌ అయిన ‘మూకీ ఎరా’కు.. 1927లో రిలీజ్‌ అయిన ‘జాజ్‌ సింగర్‌’ అనే మొట్టమొదటి టాకీ చిత్రంతో ఫుల్‌స్టాప్‌ పడిరది.

అలాగే భారతదేశంలో 1913లో ‘రాజా హరిశ్చంద్ర’తో మొదలైన మూకీ శకం` 1932లో వచ్చిన ‘ఆలం అరా’తో ముగిసింది.
అదేవిధంగా తెలుగులో 1921లో ‘భీష్మ ప్రతిజ్ఞ’తో ప్రారంభమైన మూకీ పర్వానికి 1932లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ అనే టాకీ చిత్రం స్వస్తి పలికింది.

‘టాకీ’ అనేది ఒక టెక్నికల్‌ అడ్వాన్స్‌మెంట్‌ అనుకొన్నవాళ్లంతా షాక్‌ అయ్యేలా, ‘సైలెంట్‌ మూవీస్‌’ అంతరించిపోయిన 50 సంవత్సరాల తర్వాత.. 1976లో ‘మెల్‌ బ్రూక్స్‌’ అనే హాలీవుడ్‌ దర్శకుడు ‘సైలెంట్‌ మూవీ’ పేరుతో ఓ సైలెంట్‌ చిత్రాన్ని తీసి పెద్ద హిట్‌ చేసాడు.
మాటలనేవి లేకుండా తీసిన ‘సైలెంట్‌ మూవీ’ ఇప్పుడెందుకు ఆడుతుందనుకున్నార’ని అని మెల్‌ బ్రూక్స్‌ని ప్రశ్నించినప్పడు.. అందరికీ బుర్ర తిరిగిపోయే సమాధానమిచ్చాడాయన. ‘1903లో డైలాగ్స్‌ లేని సైలెంట్‌ సినిమాను అర్ధం చేసుకోగలిగినప్పడు.. ఇప్పుడెందుకు అర్ధం చేసుకోలేరు? అనుకున్నాను. అంతే’’ అన్నాడాయన.

అలాగే, సింగీతం శ్రీనివాసరావు మన దేశంలో మూకీ శకం ముగిసిపోయిన 60 ఏళ్ల తర్వాత ‘పుష్పక విమానం’ తీసి అందర్నీ ఆశ్యర్యపరిచాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు ‘టాకీ’ లేని సైలెంట్‌ ఫిలిం ఒక్కటి కూడా రాలేదు.

సినిమాలో ‘సౌండ్‌’కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ‘సైలెన్స్‌’కి కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఉంటుందన్నది ఎన్నోసార్లు రుజువైన నిజం.

వీటన్నిటి నుంచి పొందిన స్ఫూర్తితో.. ఇప్పుడు నేను క్రైమ్‌ కామెడి జోనర్‌లో టాకీ అనేది లేని కంప్లీట్‌ మూకీ సినిమా తీయబోతున్నాను. నా సినిమా పేరు ‘సైలెంట్‌’.

గమనిక: ఈ సినిమాకు భాష లేదు కాబట్టి.. అన్ని భాషల్లోనూ ఈ ‘సైలెంట్‌’ మూవీ విడుదలవుతుంది!!