ఇక ‘నిధుల’ వేట.. !!

ncbn

సార్వత్రిక ఎన్నికల సమయంలో.. సీమాంధ్ర అభివృద్దిపై స్పష్టమైన హామి ఇచ్చారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. ఫలితంగా తెదేపాకు పట్టం కట్టారు సీమాంధ్ర ప్రజలు. జూన్ 8న సీమా’ఆంధ్రప్రదేశ్’ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇక, చంద్రబాబు ఏకైక లక్ష్యం సీమాంధ్ర అభివృద్ధి. అందుకు తగిన నిధులు కావాలి. సీమాంధ్రకు రాజధాని, హైకోర్టు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు.. తదితరవి నిర్మించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరం. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు నిధుల వేటపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

తాజాగా, చంద్రబాబు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అంతకుముందు బాబు.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో వున్న అంశాలతో పాటు కీలకమైన అంశాలను బాబు వారితో చర్చించనున్నారు. ఇక, మోడీతో సమావేశంలో… సీమాంధ్ర ప్యాకేజీ చర్చకు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి.. చంద్రబాబు సీమాంధ్ర అభివృద్ధికి నిధుల వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా, 15వ ఆర్థిక సంఘం సభ్యుడు వై. గోపాల్ రెడ్డితో కూడా బాబు భేటీకానున్నారు.