ఏటికి ఎదిరెళ్లే ధైర్యం రాంగోపాల్ వర్మది. ఎప్పటికీ తాను అనుకొన్నదే చేస్తాడు.. ఆచరిస్తాడు. అలాంటిది వర్మ కూడా తొలిసారి భయపడ్డాడు. తన అభిరుచులకు అనుగుణంగా నడుచుకొన్నాడు. ఇంతకీ వర్మని భయపెట్టింది ఎవరో తెలుసా..?? మోహన్‌బాబు. మంచు కాంపౌండ్ లో వర్మ చేసిన సినిమా రౌడీ. ఈ సినిమా ప్రచారం కాస్త ఆర్భాటంగానే జరుగుతోంది. ఆడియో ఫంక్షన్ తిరుపతిలో చేశారు. విశాఖ, బెంగళూరుల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వీటన్నింటికీ ఓపిగ్గా తిరిగాడు వర్మ. వెళ్లిన చోటల్లా… వర్మ మెడలో దండలూ కనిపించాయి. చిరు సత్కారాలు కూడా జరిగాయి. ఇవన్నీ చూసి వర్మ మారిపోయాడేంటి?? అనుకొన్నారంతా. ఎందుకంటే ఇలాంటి హంగామాకి వర్మ పూర్తి వ్యతిరేకం. మీరు కూడా దండలూ, సన్మానాలకు అలవాటు పడ్డారా?? అని వర్మని అడిగితే “అలాంటిదేం లేదు. వాళ్లు వేశారు, నేను వేయించుకొన్నా. పైగా మోహన్ బాబుగారిని చూసి భయపడ్డా. దండలు వేయించకపోతే కొడతా.. అన్నట్టు చూశారాయన..“ అని చమత్కరించాడు. మొత్తానికి లౌక్యంగా బతకడం ఎలాగో తెలుసుకొన్నాడు వర్మ.