అభిమానులలో మెగా చీలిక

crack-in-mega-fans

మొదట్లో సినిమా హీరోల అభిమానులంటే సినిమా హీరో అభిమానులు మాత్రమే. కానీ ఎన్టీఆర్‌ రాజకీయరంగ ప్రవేశం తర్వాత అభిమానులలో తొలిసారి రాజకీయచైతన్యం బాగా పెరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అభిమానులకు ప్రజాస్వామ్యంలో నిర్దిష్టమైన విలువను, స్ధాయిని అపాదించిన మహా రాజకీయనాయకుడు ఎన్టీఆర్‌ అనే చెప్పాలి. సినిమా కధానాయకుడిగా అభిమానులకు ఎంతటి గర్వం మిగిల్చారో, సంచలన రాజకీయనాయకుడిగా, సమర్ధుడైన ప్రజాపరిపాలకుడిగా అంత కన్నా ఎక్కువే గౌరవాన్ని, గర్వాన్ని తన అభిమానులకు మిగిల్చిన ఘనత ఎన్టీఆర్‌ కే చెందుతుంది.

పులిని చూసిన నక్క
ఆయనను అనుకరించి ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలని ఉవ్శిళ్ళూరిన చిరంజీవి తన ప్రయత్నంలో అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వాన్ని స్ధాపిస్తే, తాను మరో అడుగు ముందేసి కేవలం ఏడు నెలల కాలంలోనే ప్రభుత్వం స్ధాపించాలని చిరంజీవి దురాశ పడ్డారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని అనాడే చిరంజీవి విమర్శలతో చితికిపోయారు. సినిమాలలో చిరంజీవి డైలాగ్‌ లకు ఈలలు చప్పట్లు కొట్టిన అభిమానులు తమ హీరో ఈ విధంగా తుస్‌మనిపించగానే తల దించుకునే పరిస్థితిని చవి చూశారు. పైగా టిక్కెట్ల పంపకంలో కూడా దశాబ్దాల తరబడి ఆయన అభిమాన సంఘాల నాయకులుగా వ్యవహరించిన వారిలో కొందరికి టిక్కెట్లు ఇస్తామని అల్లు అరవింద్‌ చివరాఖరుకి వచ్చేసరికి మొండి చేయి చూపించడంతో ఆ క్షణమే చిరంజీవితో తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పంచన చేరిపోయారు సదరు అభిమాన సంఘాల నాయకులు. అప్పుడే చిరంజీవిపైన వారు నమ్మకాన్ని కోల్పోయారు.

హీరో కాదు జీరో
చిరంజీవి తెర పైనే హీరో తప్ప రియల్‌ హీర్ కాదని పెద్ద జీరో అని వారు బాహాటంగానే ఆనాడు నోరు చేసుకున్నారు. ఆనాటి నుంచి పిఆర్‌పి పార్టీ పిల్లి మొగ్గలు చూసి అభిమానులంతా ఇతర హీరోల అభిమానుల ఎద్దేవాకి తీవ్రంగా గురి అయ్యారు. పైగా చిరంజీవి చిత్రసీమకు దూరం  కావడంతో చిరంజీవిని ఇంకా ఆరాధించడమన్నది కేవలం ఆత్మహత్యతో సమానమేనని మెల్లిగా జారుకోవడం మొదలెట్టారు. అటూఇటుగా తచ్చాడుతున్నవారు కక్కలేక మింగలేక తటస్థంగా ఉండిపోయారు. అయితే చిరంజీవి అభిమానులంతా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులుగా మారిపోయి పవన్‌ సినిమాల మాటున తల దాచుకున్నారు. పవన్‌ సంచలన విజయాలు అందుకున్న తరువాత వారికి కొంత ఊరట కలిగిందనే చెప్పాలి. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశం తెరమీదకి జోరుగా వచ్చిందో ఆనాటి నుంచి చిరంజీవి కప్పదాటు వ్యవహారాన్ని వారు జీర్ణించుకోలేక టీవీలలో ప్రత్యక్షంగానే విమర్శలకు దిగారు. ఇన్నాళ్లూ ఆయన పోస్టర్లు, బ్యానర్లు మోసుకు తిరిగినందుకు తమకు తగిని గుణపాఠమే నేర్పాడని చిరంజీవిపైన మాటల యుద్ధానికి దిగారు. వీటిని వేటినీ చిరంజీవి పట్టించుకునే పరిస్థితిలో లేనేలేకపోవడం గమనార్హం. ఎంతసేపు తన మనుగడ ఎలా అన్న అంశంపైనే కసరత్తు చేయడంతోనే చిరంజీవికి సరిపోయింది. ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని ఎవరూ కూలదోయకుండా తన ఎంఎల్‌ ఏలతో కాంగ్రెస్‌లో చేరానని చిరంజీవి బొంక పలికినా ఆ వాదనని అంగీకరించే స్ధాయిని చిరంజీవి అభిమానులు ఏనాడో దాటిపోయారు. పార్టీని నడుపుకోలేక, ఖర్చుకి వెరచి చివరికి పార్టీ కార్యాలయాలను కూడా మూసుకునే దురవస్ధలో కాంగ్రెస్‌లో విలీనం చేసి చేతులు దులుకున్న సంగతి పార్టీలో నేతలే బైటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఛిరంజీవి గోడ మీద పిల్లి అని ఆయన వ్యవహార శైలే చెప్పక చెబుతూ వచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, పైగా హైదరాబాద్‌ ని యుటి చెయ్యమని ప్రతిపాదించడం వంటి ప్రతీ పరిణామం అభిమానులని తీవ్రమైన నిరాశకు గురి చేసింది.

పవర్‌ పంచ్‌
రాష్ట్ర విభజన అనంతరం అభిమానులు పూర్తిగా చిరంజీవికి వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. ఎన్నికలు అత్యంత చేరువలో ఉన్న సమయంలో చిరంజీవి మళ్ళీ ప్రచారానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని వారు విమర్శించారు. ఇదే సమయంలో కరెక్టుగా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడంతో అభిమానులంతా పవన్‌ కి కొమ్ము కాయడానికి సిద్ధపడ్డారు. ఏ కాంగ్రెస్‌ పంచన చేరి రాష్ట్ర విభజనకు చిరంజీవి జై కొట్టి, సై అన్నారో అదే కాంగ్రెస్‌ పార్టీ గుండెల్లో నిద్రపోవడమే తన ధ్యేయంగా పవన్‌ సంచలన ప్రకటన చేయడంతో అభిమానులకు ఇప్పుడు కొండంత అండ దొరికి నట్టుగా భావిస్తున్నారు. హమ్మయ్య అన్నను నమ్ముకుని దెబ్బ అయిపోయాం… తమ్ముడైనా తమ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తగెంచినందుకు అందరూ పవన్‌ కు అభినందనలు తెలిపారు. పైగా కాంగ్రెస్‌ హఠావో, దేశ్‌కో బచావో అన్న నినాదం వారిలో అంతులేని ఉత్తేజాన్ని, హుషారుని నింపింది.
50 లక్షలకు పైగా జంప్‌
ఇంకా ఇంత జరిగాక కూడా చిరంజీవి అభిమానులను గురించి ఆశ పడడం చిరంజీవిలోని అపరిపక్వతకు బండ గుర్తు అని చిరంజీవి సన్నిహిత నిర్మాత ఒకరు వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్ తనవైపే ఉంటారన్న చిరంజీవి భరోసాని వారు తోసి పుచ్చుతున్నారు. ఇంకా చిరింజీవిని నమ్మడానికి తామేమీ వెర్రి వెంగళప్పలం కాదని వారు చెబుతున్నట్టుగా క్షేత్రస్ధాయి నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీలోనే ఇంకా ఉంటూ ఒక్క కాంగ్రెస్‌ దే కాదు తప్పు అని చిరంజీవి డంభాలు పలకడాన్ని అభిమానులు తీవ్రంగా ఏవగించుకుంటున్నారు. తమ ఆత్మాభిమానాన్ని దారుణంగా దెబ్బ తీసిన కాంగ్రెస్‌ మాడు పగల గొట్టడానినే తాను వస్తున్నానని పవన్‌ ప్రకటించడం వారికి ఎంతో స్వాంతనని కలిగించిన మాట వాస్తవం. కత్తి దూసి కళ్యాణ్ వస్తుంటే, తన ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్‌కి ఉంటాయని చెప్పడం కేవలం లేని, ఇవ్వని పెద్దరికాన్ని మీదనేసుకోవడమేనన్నది అభిమానుల తాజా అభిప్రాయం. చిరంజీవి రిజిస్టర్డ్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షలకు పైగా ఉన్నారు. వారందరూ కూడా చాలా కాలంగా పవన్‌ కళ్యాణ్‌ తోనే కొనసాగుతున్నారు. వారందరి ఓటు బ్యాంకు, అదనంగా రాష్ట్ర విభజనను నిరసించిన వారంతా కూడా పవన్‌ కళ్యాణ్‌ వెంటే ఉంటారిప్పుడు. వపన్‌ ఏ పార్టీకి కొమ్ము కాస్తే ఆ పార్టీకే వారి మద్దతు ఉంటుందని అభిమానులే చెబుతున్నారు.