తాత్కాలిక ప్రయోజనాల కోసమే విభజన చిచ్చు : బాబు

cbnరాష్ట్ర విభజన విధానంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. విభజన తప్పని అనడం లేదని, విభజిస్తున్న తీరే తప్పని చెబుతున్నామని ఆయన అన్నారు. టీ-బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన అనంతరం బాబు విలేకరులతో మాట్లాడుతూ.. చాలా బాధగా వుందని, తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

జులై 30 నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేషాలు సృష్టించవద్దు, విషబీజాలు నాటవద్దని ఎన్నోసార్లు చెప్పినా… వాటిని కాంగ్రెస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని బాబు మండిపడ్డారు.

ఎన్నికలకు ముందే తెరాస కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న బాబు.. జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజన వాది అని అన్నారు. ఇప్పటివరకు సమన్యాయం కోసం తాను చేయాల్సిందంతం చేశానని బాబు ఉద్ఘాటించారు. సభలో తగిన బలం లేనందునే తమ వాణిని సమర్థంగా వినిపించలేకపోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.